పెన్సిల్ పట్టిన తెలుగమ్మాయి!

పెన్సిల్ పట్టిన తెలుగమ్మాయి!

శ్రీదివ్య.  అందమైన పేరు. ఈ పేరు పెట్టుకున్న ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. నటనలోనూ తిరుగులేదు. చేతిలో ఒకట్రెండు విజయాలు కూడా పడ్డాయి. అయితే ఈ అందమైన అమ్మాయికి  తెలుగులో అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. కారణం కూడా...  తెలుగమ్మాయి కావడమే. అవును...  మన చిత్రసీమలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు. `నాకు టెల్గు కొంచె కొంచెం వచ్చు` అని హొయలు పోయే ముంబయి ముద్దుగుమ్మలే మన దర్శకులకు మేలు. వాళ్ళలో ఏం నచ్చుతుందో దర్శక నిర్మాతలకే తెలియాలి. అందుకే వేరే గత్యంతరం లేక తెలుగమ్మాయిలు పక్క భాషలపై దృష్టిపెడుతుంటారు. అక్కడ ప్రతిభ కనబరుస్తూ అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మనం మాత్రం `తెలుగమ్మాయిలు చిత్ర పరిశ్రమల్లోకి రావడానికి ఆసక్తి చూపరు` అని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాం.

ప్రస్తుతం అచ్చమైన తెలుగు కథానాయికలు స్వాతి, బిందు మాధవి, శ్రీదివ్య...  తమిళం, మళయాళ భాషల్లో రాణిస్తున్నారు. నిన్న మొన్ననే తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీదివ్య అక్కడ చక్కటి ప్రతిభ కనబరుస్తోంది. `వడుత్త పడత వలిబార్ సంగం` అనే సినిమాతో ఇటీవల మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మరొక మంచి అవకాశాన్ని సొంతం చేసుకుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆయన కథానాయకుడిగా `పెన్సిల్` అనే సినిమా తెరకెక్కుతోంది. మణి నాగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పన్నెండో తరగతి చదువుకునే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో కథానాయికగా మొదట ప్రియా ఆనంద్ ని ఎంచుకున్నారు. చివరి నిమిషంలో ఆమెను తప్పించి శ్రీదివ్యను ఎంపిక చేశారు.వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. శ్రీదివ్య తెలుగులో `మనసారా`. `బస్ స్టాప్`, `మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు` తదితర సినిమాల్లో నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు