సెన్సేషనల్ మూవీ.. ఆచార్య అరెస్ట్

సెన్సేషనల్ మూవీ.. ఆచార్య అరెస్ట్

తెలుగువాడైన శ్రీనివాసరాజు.. కన్నడలో 'దండుపాళ్యం' అనే సినిమా తీసి ప్రకంపనలు రేపాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటకలో సంచలన విజయం సాధించింది. తర్వాత అదే సినిమా తెలుగులోనూ అనువాదమై ఇక్కడి ప్రేక్షకలనూ ఆకట్టుకుంది.

దీనికి కొనసాగింపుగా 'దండుపాళ్యం-2' కూడా తీశాడు శ్రీనివాసరాజు. ఇప్పుడతను మరో సెన్సేషనల్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ప్రకటనతోనే వివాదాలు మొదలైపోయాయి. కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. ఆ సినిమా పేరు.. ఆచార్య అరెస్ట్. దీనికి 'ఇన్సల్ట్ టు ఎవ్రీ హిందూ' (ప్రతి హిందువుకూ అవమానం) అనే ట్యాగ్ లైన్ కూడా జోడించడం విశేషం.

2004లో కంచి పీఠాధిపతి ఆచార్య జయేంద్ర సరస్వతిని అరెస్టు చేసిన సంచలన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆ పీఠంలో జరిగిన ఓ భక్తుడి హత్యకు సూత్రధారిగా భావించి జయేంద్ర సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే శ్రీనివాసరాజు 'ఆచార్య అరెస్ట్' సినిమా తీయనున్నాడు. ఈ కేసు వెనుక అసలు వాస్తవాలేంటో తన సినిమా ద్వారా చూపించబోతున్నాడట శ్రీనివాసరాజు.

ఈ కేసు వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు.. రాజకీయ కోణాలు.. మతపరమైన విషయాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. మొదట్లో దీని మీద చాలా చర్చ నడిచింది కానీ.. తర్వాత అందరూ దీని గురించి మరిచిపోయారు. ఇప్పుడు 'ఆచార్య అరెస్ట్'తో ఆ తేనె తుట్టను కదపబోతున్నాడు శ్రీనివాసరాజు. ఈ సినిమా కచ్చితంగా వివాదాస్పదమవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ చిత్రానికి వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు