యుద్ధం ప్రకటించేసిన హరీష్ శంకర్

యుద్ధం ప్రకటించేసిన హరీష్ శంకర్

'దువ్వాడ జగన్నాథం' రిలీజైన దగ్గర్నుంచి ఈ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడిన.. రాసిన వాళ్లందరి మీదా తీవ్ర స్థాయిలో మాటల దాడికి దిగుతూ వస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ చిత్ర వసూళ్ల గురించి నెగెటివ్ వార్తలు ఇస్తున్న వాళ్లను టార్గెట్ చేశాడు హరీష్.

నైజాం ఏరియాలో 13 రోజులకే 'దువ్వాడ జగన్నాథం' రూ.20 కోట్ల షేర్ సాధించిందని చెబుతూ దానికి సంబంధించిన కలెక్షన్ల బ్రేకప్ ఉన్న లింక్ షేర్ చేసిన హరీష్.. ఈ కలెక్షన్లలో తప్పు ఉందని ఎవరైనా రుజువు చేస్తే తాను సినిమాల నుంచి నిష్క్రమిస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు హరీష్. ఒకవేళ తాము ఇస్తున్న కలెక్షన్లు తప్పని తేలితే.. మీ వెబ్ సైట్ మూసేస్తారా అంటూ సవాలు విసిరాడు హరీష్.

హరీష్ అంతటితో ఆగకుండా తాను ఎంతటి విమర్శలనైనా భరిస్తానని.. కానీ తన యూనిట్ సభ్యుల కష్టాన్ని మాత్రం పణంగా పెట్టలేనని వ్యాఖ్యానించాడు. తాను 'దువ్వాడ జగన్నాథం' సక్సెస్ ను ఎంజాయ్ చేద్దామనే అనుకుంటున్నానని.. కానీ ఇలా ట్వీట్ చేయాల్సి వస్తోందని.. ''తప్పలేదు.. యుద్ధం శరణం గచ్ఛామి'' అంటూ తన సినిమాలోని డైలాగ్ ను కోట్ చేశాడు హరీష్ శంకర్.

మరి హరీష్ ఏ వెబ్ సైట్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ.. అతనింత ఎమోషనల్ అయిపోవడం ఏమిటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. 'దువ్వాడ..' మీద వచ్చిన విమర్శలు వేటినీ అడ్రెస్ చేయకుండా.. ఇందులోని లోపాల గురించి మాట్లాడకుండా ఎంతసేపూ తనో గొప్ప సినిమా తీసిన ఫీలింగ్ చూపిస్తూ.. పదే పదే కలెక్షన్లను ముందు పెట్టి అవతలి వాళ్లపై అటాక్ చేస్తూ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడో హరీష్ శంకర్?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు