'నక్షత్రం' గోలను భరించగలరా?

'నక్షత్రం' గోలను భరించగలరా?

చాన్నాళ్లుగా వార్తల్లో లేని 'నక్షత్రం' మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సడెన్‌గా నిన్న, బుధవారం ఆడియో వేడుక చేసి ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చారు. కుదిరితే ఈ నెల 21నే 'నక్షత్రం'ను థియేటర్లలోకి తెచ్చేయాలని భావిస్తున్నారు. ఆడియో వేడుకలో పాటలతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

ఆ ట్రైలర్ చూస్తే మాత్రం సినిమా మీద జనాలు పెద్దగా అంచనాలు పెట్టుకోవాల్సిన పని లేదని అనిపిస్తోంది. కృష్ణవంశీ పది పదిహేనేళ్లు వెనక్కి వెళ్లి.. ఖడ్గం, సముద్రం సినిమాల ఛాయల్లో 'నక్షత్రం'ను రూపొందించినట్లుగా అనిపిస్తోంది. సినిమా అంతటా కృష్ణవంశీ మార్కు అయితే స్పష్టంగా కనిపిస్తోంది కానీ.. ప్రతి చోటా 'పాత' కృష్ణవంశీ కనిపిస్తుండటమే ఇబ్బందిగా అనిపిస్తోంది.

సినిమాలో విజువల్స్ కానీ.. క్యారెక్టర్లు కానీ.. వాళ్ల అరుపులు కానీ.. అన్నీ కూడా కృష్ణవంశీ ఎప్పుడో తీసిన సినిమాల్ని గుర్తుకు తెస్తున్నాయి. కృష్ణవంశీ సినిమాలంటే తెరమీద చాలామంది నటీనటులు కనిపించడం.. వాళ్లందరూ కూడా కొంచెం ఎక్కువగా నటించేయడం.. ఎక్కువ మాట్లాడేయడం.. అరిచేయడం.. ఇలా అంతా గోల గోలగా ఉంటుంది.

ఒకప్పుడు ఈ తరహా ఎంటర్టైన్మెంట్‌ను జనాలు బాగానే ఆస్వాదించేవారు కానీ.. గత కొన్నేళ్లలో మన ప్రేక్షకుల అభిరుచి మారింది. నటీనటులు మరీ అలా అరిచేస్తే.. అతిగా నటించేస్తుంటే.. ఇప్పటి ప్రేక్షకులు ఏమాత్రం రిసీవ్ చేసుకుంటారన్నది సందేహం. ఇప్పుడు ఏదైనా సటిల్‌గా ఉండాలని కోరుకుంటారు జనాలు. గోల గోలగా ఉంటే జనాలకు ఏమాత్రం కనెక్టవుతుందన్నది సందేహం. మరి ట్రైలర్‌తో అంత మంచి ఫీలింగేమీ కలిగించని కృష్ణవంశీ.. సినిమాతో ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు