రవితేజ ప్రెస్ మీట్.. రచ్చ రచ్చ

రవితేజ ప్రెస్ మీట్.. రచ్చ రచ్చ

తమ్ముడు భరత్ చనిపోతే అతణ్ని కడసారి చూసుకోకపోవడానికి రాలేదంటూ రవితేజ మీద విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై వారం తర్వాత ఓ ప్రధాన పత్రికతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు రవితేజ. ఈ సందర్భంగా మీడియా తీరును తీవ్రంగా తప్పుబట్టాడు రవితేజ. ఐతే రవితేజ వివరణపై మిగతా మీడియా వర్గాల్లో చాలానే చర్చ నడిచింది. ఏదైనా చెప్పాలనుకుంటే మొత్తం మీడియాను రవితేజ అడ్రస్ చేయాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రవితేజ ఇప్పుడు అదే పని చేశాడు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. తమ్ముడి మరణానంతర పరిణామాలపై తన వాదన వినిపించాడు.

ఛిద్రమైన తమ్ముడి ముఖాన్ని చూడలేకే తమ కుటుంబ సభ్యులవెరూ అతణ్ని చూసేందుకు వెళ్లలేదని రవితేజ మరోసారి స్పష్టం చేశాడు. ఆ కారణంతోనే భరత్ పార్థివ దేహాన్ని ఇంటికి కూడా తేలేదన్నాడు. తన తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు రవితేజ.

యూట్యూబ్ ఛానెళ్లలో తన గురించి.. తన కుటుంబం గురించి ఇష్టానుసారం చేసిన వ్యాఖ్యల్ని తొలగించాలని రవితేజ కోరాడు. ఐతే ఈ సందర్భంగా మీడియావాళ్లు అడిగిన ప్రశ్నలకు రవితేజ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఎవరో ఒకరిద్దరు తప్పుగా రాస్తే మొత్తం మీడియాను తిట్టడం ఎంత వరకు సమంజసమంటూ మీడియా వాళ్లు ప్రశ్నించారు. ఇంకా కొన్ని ప్రశ్నలు వేశారు.

వాటికి సమాధానం చెప్పకుండా రవితేజ ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయాడు. దీనికి తోడు రవితేజ వ్యక్తిగత సిబ్బంది మీడియా వాళ్లతో దురుసుగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. మొత్తానికి మరోసారి రవితేజ పేరు ప్రతికూల కారణాలతో వార్తల్లోకెక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు