సంజయ్.. కోనకు ఫోన్ చేశాడట

సంజయ్.. కోనకు ఫోన్ చేశాడట

ఈ మధ్య జనాల్లో చురుకుదనం మరీ ఎక్కువైపోయింది. ప్రపంచ సినిమా మన అర చేతుల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఎక్కడ ఏ సినిమా నుంచి ఓ చిన్న సన్నివేశం కాపీ కొట్టినా ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఇందుకోసం సినిమా వచ్చే వరకు కూడా ఆగట్లేదు. ట్రైలర్ చూసే ఇది ఫలానా సినిమా కాపీ అంటున్నారు. నాని కొత్త సినిమా 'నిన్ను కోరి' విషయంలో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

ఇది సంజయ్ లీలా బన్సాలీ క్లాసిక్ మూవీ 'హమ్ దిల్ కే చుకే సనమ్'కు కాపీ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ చూస్తే.. ఈ చిత్రం ఆ లైన్స్‌లోనే సాగేలా అనిపిస్తోంది. ఐతే నాని ఈ ప్రచారాన్ని ఖండించాడు. ఆ హిందీ సినిమాకు.. తమ సినిమాకు అసలు సంబంధం లేదని స్పష్టంచేశాడు.

'నిన్ను కోరి' సినిమా 'హమ్ దిల్ కే చుకే సనమ్'కు కాపీ అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఆ చిత్ర దర్శకుడు బన్సాలీ వరకు వెళ్లినట్లు నాని చెప్పడం విశేషం. ఆ ప్రచారం గురించి విని బన్సాలీ.. కోనకు ఫోన్ కూడా చేసినట్లు నాని వెల్లడించాడు. ఐతే 'నిన్ను కోరి' కథ గురించి కోన చెప్పినపుడు బన్సాలీ కూడా ఆశ్చర్యపోయి మెచ్చుకున్నట్లు కోన తెలిపాడని నాని చెప్పాడు.

'హమ్ దిల్ కే చుకే సనమ్' ఎక్కడ ఆగిందో.. అక్కడ 'నిన్ను కోరి' మొదలవుతుందని.. ఇది పూర్తిగా భిన్నమైన సినిమా అని.. థియేటర్లోకి వెళ్లాక మరే సినిమా కూడా గుర్తుకు రాదని.. అలా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇదని నాని తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు