అలాంటి ప్రేక్షకులు నాకొద్దంటున్న ఇంద్రగంటి

అలాంటి ప్రేక్షకులు నాకొద్దంటున్న ఇంద్రగంటి

టాలీవుడ్ దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణది ప్రత్యేకమైన శైలి. గత కొన్నేళ్లలో తెలుగు సినిమా హాస్య శైలి మారిపోయి.. అందరూ బూతుల మీద ఆధారపడుతున్నప్పటికీ ఇంద్రగంటి మాత్రం వాటి జోలికి వెళ్లట్లేదు. అందులోనూ ‘జబర్దస్త్’ లాంటి కామెడీ షోల తర్వాత డబుల్ మీనింగ్ డైలాగుల హోరు బాగాఎక్కువైపోయింది.

అయినప్పటికీ ఇంద్రగంటి మాత్రం క్లీన్ కామెడీకే పెద్ద పీట వేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘అమీతుమీ’లోనూ అలాంటి కామెడీతోనే హిట్టు కొట్టాడు. మరి ట్రెండును ఫాలో అవ్వకుండా మీ దారిలో మీరెళ్తున్నారేంటి అని అడిగితే తానింతే అంటున్నాడు ఇంద్రగంటి. సినిమాను పెద్ద హిట్ చేయడం కోసమో.. కలెక్షన్ల కోసమో తాను అడ్డదారులు తొక్కనని తేల్చి చెప్పేశాడతను. బూతుల కోసం ఆశించే ప్రేక్షకులు తనకు సినిమాలకు రాకపోయినా పర్వాలేదన్నాడాయన.

‘‘బూతు కామెడీ ఎక్కువమందికి చేరుతుంది.. ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నా సరే  నేను ఆ దారిలో నడవలేను. ప్రేక్షకుడు సినిమాని బట్టి మారతాడు. ఆరోగ్యకరమైన ప్రేక్షకుణ్ని తయారు చేయాలా.. లేదా.. అన్నది సినిమాపై ఆధారపడి ఉంటుంది. మాకు బూతు కావాలి.. డబుల్ మీనింగ్ డైలాగులే కావాలి అని ప్రేక్షకులెప్పుడూ ధర్నాలు చేయరు కదా? మనం తీసినవే వాళ్లు చూస్తున్నారు. ఆరోగ్యకరమైన వినోదం అందరికీ చేరదు.. కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు రారు అని ఎవరైనా అంటే అలాంటి ప్రేక్షకుల్ని కోల్పోవడానికీ నేను సిద్ధమే. వాళ్ల కోసం నేను మెట్లు దిగను. నిజం చెప్పాలంటే బూతు రాయడం చాలా తేలిక. క్లీన్ కామెడీ రాయాలంటేనే చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఆ కష్టాన్నే ఇష్టపడతాను. నా శైలి మార్చుకోను’’ అని తేల్చి చెప్పాడు ఇంద్రగంటి. ఈ రోజుల్లో ఇలాంటి కన్విక్షన్ ఉన్న దర్శకులుండటం గొప్ప విషయమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు