రామ్‌ చరణ్‌ ఖాతాలో బాహుబలి రికార్డు!

రామ్‌ చరణ్‌ ఖాతాలో బాహుబలి రికార్డు!

రామ్‌ చరణ్‌కి, బాహుబలికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఎవరో ఒక తెలివైన వ్యక్తి రామ్‌ చరణ్‌ నటించిన 'మగధీర' చిత్రాన్ని 'బాహుబలి'తో లింక్‌ చేసి యూట్యూబ్‌లో మగధీర సినిమా అప్‌లోడ్‌ చేసాడు. దాంతో అది యూట్యూబ్‌లో సూపర్‌హిట్‌ అయిపోయింది. వంద మిలియన్‌ వ్యూస్‌ సాధించిన తొలి తెలుగు అనువాద చిత్రంగా యూట్యూబ్‌లో మగధీర రికార్డు సాధించింది.

'బాహుబలి 2' అనే టైటిల్‌తో ఈ సినిమాని అప్‌లోడ్‌ చేయడమే ఈ విజయానికి కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో మగధీర హిందీ అనువాదానికి బాహుబలి 2 అని పేరు పెట్టి యూట్యూబ్‌లో పెట్టడంతో జనం ఎగబడి క్లిక్‌ చేసారు. ఆ తర్వాత కానీ అది రాజమౌళి తీసిన మరో సినిమా అనే సంగతి తెలీలేదు. ఈ ట్రిక్‌ చాలా మందికి కోపం తెప్పించిందనేది 57 వేలకి పైగా వున్న డిస్‌లైకుల ద్వారానే తెలుస్తోంది.

కామెంట్స్‌ డిసేబుల్‌ చేయడం వల్ల జనం తిట్టడానికి లేకుండా పోయింది. అయినప్పటికీ లక్షా యాభై వేల మంది లైక్‌ కొట్టారనుకోండి. బాహుబలి కంటే ముందు రాజమౌళి ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదించి వుంటే అప్పట్లోనే సంచలనం సృష్టించేదేమో. హిందీ చిత్ర సీమలో మగధీర సంచలనాలకి తెర లేవకపోయినప్పటికీ యూట్యూబ్‌ వరకు ఈ చిత్రం ఒక గొప్ప రికార్డుని సాధించింది. టైటిల్‌తో చేసిన గిమ్మిక్‌ని వదిలేసి చరణ్‌ ఫాన్స్‌ ఈ ఫీట్‌ ఎంజాయ్‌ చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు