బాలయ్యతో కంటే ముందు చైతూతో ఢీ

బాలయ్యతో కంటే ముందు చైతూతో ఢీ

సీనియర్ హీరో శ్రీకాంత్ హీరో వేషాలు వేసి వేసి అలసిపోయాడు. గత కొన్నేళ్లలో శ్రీకాంత్ హీరోగా చేసిన సినిమాల్ని జనాలు పట్టించుకోవడమే మానేశారు. దీంతో ఇక హీరో వేషాలకు సెలవిచ్చేసి ప్రత్యేక పాత్రలు.. నెగెటివ్ రోల్స్ వైపు చూస్తున్నట్లుగా ఉన్నాడు శ్రీకాంత్.

హీరోగా ఉన్నపుడే క్యారెక్టర్ చేయడానికి వెనుకాడలేదు శ్రీకాంత్. ఇప్పుడు పూర్తిగా వాటిపైనే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. హీరో కావడానికి ముందు నెగెటివ్ రోల్స్ చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు మరోసారి ప్రతినాయక అవతారాలు ఎత్తడానికి రెడీ అయ్యాడు.

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే కొత్త సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్ర చేయబోతున్నట్లుగా సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే దాని కంటే ముందు శ్రీకాంత్ మరో ఇంట్రెస్టింగ్ మూవీలో నెగెటివ్ రోల్ చేసేయడం విశేషం. ఆ సినిమానే.. యుద్ధం శరణం. అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ఇది. ఈ రోజే దీని టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ముందు చైతూ సోలో లుక్ ఒకటి బయటికి వదిలి.. తర్వాత శ్రీకాంత్‌, చైతూ ఇద్దరూ ఉన్న మరో పోస్టర్ కూడా లాంచ్ చేశారు.

శ్రీకాంత్ లుక్ స్పెషల్‌గా ఏమీ లేదు కానీ.. ఆయనది సినిమాలో కీలక పాత్ర అని సమాచారం. శ్రీకాంతే లీడ్ విలన్ అన్న సంగతి కూడా చిత్ర బృందం ధ్రువీకరించింది. ఇదొక రివెంజ్ థ్రిల్లర్ అంటున్నారు. హీరో డ్రోన్స్ ఆపరేట్ చేసే కుర్రాడిగా కనిపిస్తాడట. ఆ డ్రోన్స్ సాయంతోనే ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటాడట. కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘వారాహి చలనచిత్రం’ అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు