మరో గొప్పోడి సినిమాలో అమీర్ ఖాన్

మరో గొప్పోడి సినిమాలో అమీర్ ఖాన్

పాత్ర ఏదైనా సరే.. దాని కోసం ప్రాణం పెట్టి పని చేస్తాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. గత ఏడాది రిలీజైన 'దంగల్' సినిమాలో మహవీర్ సింగ్ పొగట్ పాత్ర కోసం అమీర్ ఎంతగా కష్టపడ్డాడో తెలిసిందే. అమీర్ చేసిన తొలి బయోపిక్ ఇది. ఆ పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగి పొట్టతో కనిపించడమే కాదు.. కండలు తిరిగిన మల్లయోధుడిగానూ మారి ఆశ్చర్యపరిచాడు.

అమీర్ కష్టం వృథాగా పోలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల వసూళ్లతో 'దంగల్' చరిత్ర సృష్టించింది. దీని తర్వాత అమీర్ ఖాన్ 'ఠగ్స్ ఆఫ్ హిందోస్థాన్' మీదికి దృష్టి మళ్లించాడు. ఆ పాత్ర కోసం మరోసారి పూర్తిగా అవతారం మార్చుకున్నాడు. సన్నబడి.. హేర్ స్టైల్ మార్చుకుని.. చెవులకు, ముక్కులకు పోగులతో సరికొత్తగా కనిపిస్తున్నాడు.

వచ్చే ఏడాది చివరి వరకు అమీర్ ఖాన్ 'ఠగ్స్ ఆఫ్ హిందోస్థాన్'కే అంకితమై ఉంటాడు. దాని తర్వాత అమీర్ నటించే సినిమా కూడా కన్ఫమ్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం.

భోపాల్ ఎక్స్‌ప్రెస్, బ్రోకెన్ థ్రెడ్ లాంటి గొప్ప సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మహేష్ మథాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. యూటీవీ పిక్చర్స్ అధినేత సిద్దార్థ్ రాయ్ కపూర్ కొత్తగా 'ఆర్కేఎఫ్' పేరుతో బేనర్ పెట్టి దాని మీదే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలాగా రూపొందించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కాబట్టి మరోసారి అమీర్ ఖాన్ తన ప్రత్యేకత చాటుకోవడం ఖాయమన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు