రచ్చ రచ్చ చేసిన సింగర్ మళ్లొచ్చింది

రచ్చ రచ్చ చేసిన సింగర్ మళ్లొచ్చింది

చిన్న వయసులోనే టీఆర్ఎస్ సభల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చక్కటి పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకున్న అమ్మాయి మధు ప్రియ. ఉద్యమ పాటలే కాదు.. ఆడపిల్లా ఆడపిల్లా.. అంటూ హృద్యమైన పాటలతో జనాల మనసులు దోచిందీ తెలంగాణ అమ్మాయి. ఐతే ఎప్పుడూ మంచి విషయాలతోనే వార్తల్లో ఉన్న మధుప్రియ ఆ మధ్య ఓ అనవసర వివాదంతో మీడియాకెక్కింది.

తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదని ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. తర్వాత అతను వేధించాడంటూ మీడియాకెక్కి రచ్చ చేయడం.. ఆపై తన భర్త బంగారం అంటూ మళ్లీ అతడి చెంతకే చేరడం.. ఇలా మధుప్రియ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఐతే ఆ వివాదం తర్వాత మధుప్రియ వార్తల్లోనే లేదు.

ఇప్పుడు మళ్లీ ఓ ప్రముఖ సినిమాలో పాట పాడి లైమ్ లైట్లోకి వచ్చింది మధుప్రియ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' సినిమా కోసం 'వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ ఏసిండే..' అంటూ ఓ పాట అందుకుంది మధుప్రియ. మధుప్రియ ఇంతకుముందే సినిమా పాటలు పాడింది కానీ.. ఇలా ఓ రెగ్యులర్ సినిమాలో పాట అందుకోవడం ఇదే తొలిసారి. ఇందులో హీరోయిన్ పక్కా తెలంగాణ అమ్మాయి. స్లాంగ్ కూడా అలాగే ఉంటుంది. దానికి తగ్గ వాయిస్ అయితే బాగుంటుందని మధుప్రియతో ఈ పాట పాడించారు. తెలంగాణ కవి సుద్దాల అశోక్ తేజ చక్కటి తెలంగాణ పదాలతో ఈ పాట రాశారు.

శ్రీకాంత్ కార్తీక్ అనే కొత్త సంగీత దర్శకుడు ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి ట్యూన్.. మధుప్రియ గాన.. అశోక్ తేజ లిరిక్స్.. అన్నీ బాగానే కుదిరాయి. ఈ పాట విజువల్స్ చూస్తే.. 'సఖి'లో ఏడే.. ఏడేడే అంటూ సాగే పెళ్లి పాట గుర్తుకు రావడం ఖాయం. 'ఫిదా' ఆల్బం నుంచి బయటికొచ్చిన తొలి పాట ఇది. మిగతా పాటల్ని కూడా ఒక్కొక్కటిగా ఇలాగే లాంచ్ చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు