రామ్ చరణ్.. అభిమన్యు నారాయణ?

రామ్ చరణ్.. అభిమన్యు నారాయణ?

ఒక భారీ సినిమా సెట్స్ మీద ఉందంటే.. దాని గురించి సోషల్ మీడియాలో చాలా చర్చే జరుగుతూ ఉంటుంది. ఆ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా.. దాని గురించి పెద్ద డిస్కషన్ నడుస్తుంటుంది. దాని ఆధారంగా చాలా ఊహాగానాలు నడుస్తాయి. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘రంగస్థలం 1985’ గురించి కూడా ఇప్పుడు అలాంటి ప్రచారమే నడుస్తోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర పేరు అభిమన్యు నారాయణ అంటూ ప్రచారం జరుగుతోందిప్పుడు. ‘అభిమన్యు నారాయణ.. రంగస్థల నటుడు’ అనే నేమ్ బోర్డుకు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రస్తుతం.

ఇది ‘రంగస్థలం 1985’కు సంబంధించి షూటింగ్ స్పాట్ నుంచి బయటికి వచ్చిన ఫొటో అంటున్నారు. దీని ఆధారంగా ఆ సినిమాలో చరణ్ పేరు అభిమన్యు నారాయణ అని.. అతను నాటకాలేసే ఆర్టిస్టు అని చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి సినిమా కథ ఇది అంటూ ఊహాగానాలు నడుస్తున్నాయి. ‘రంగస్థలం’ అనే టైటిల్‌ను బట్టే ఇది ఒకప్పటి రంగస్థల నాటకాల నేపథ్యంలో సాగే సినిమా అన్న ప్రచారం ముందు నుంచే ఉంది. ఐతే ఈ మధ్య చిత్ర బృందం ఈ ప్రచారాన్ని ఖండించింది.

సినిమాలో హీరో ఊరి పేరు ‘రంగస్థలం’ అని.. అందుకే ఈ పేరు పెట్టాం తప్ప.. ఇది నాటకాల నేపథ్యంలో సాగే సినిమా కాదని చెప్పింది. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో మాత్రం వేరే హింట్స్ ఇస్తోంది. మరి అసలు కథ ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకా ఆరు నెలలకు పైగా ఎదురు చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు