కొత్త హీరో పోస్ట‌ర్ల‌ను చించేశారు

కొత్త హీరో పోస్ట‌ర్ల‌ను చించేశారు

సినీ వార‌సులు తెరంగేట్రం చేయ‌టం చాలా కామ‌న్‌. అయితే.. పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. అందునా అధికార పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత కుమారుడు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం కావ‌టం త‌క్కువే. తాజాగా అలాంటి ఎంట్రీ ఏపీ మంత్రి గంటా ఫ్యామిలీలో చోటు చేసుకుంది.

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా వినిపించే మంత్రి గంటా శ్రీనివాస‌రావు కుమారుడు  గంటా ర‌వి న‌టించిన జ‌య‌దేవ్ చిత్రం ఈ రోజువు విడుద‌లైంది. ఈ చిత్రానికి సంబందించిన పోస్ట‌ర్ల‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు చించివేయ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

విశాఖ జిల్లాలోని న‌ర్సీప‌ట్నంలోని రాజు థియేట‌ర్లో ఏర్పాటు చేసిన క‌టౌట్ల‌ను.. పోస్ట‌ర్ల‌ను చించటంపై గంటా అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గంటా ఫ్యామిలీ అంటే త‌మ‌కెంతో అభిమాన‌మ‌ని.. తాము అభిమానించే కుటుంబానికి చెందిన వ్య‌క్తి హీరోగా న‌టించిన చిత్రం విడుద‌ల‌వుతుంద‌న్న ఆనందంతో ఏర్పాటు చేస్తే.. వాటిని చించివేస్తారా? అంటూ మండిప‌డుతున్నారు. రాజ‌కీయ విభేదాల‌తోనే ఇలాంటి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డి ఉంటార‌న్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది.

పోస్ట‌ర్ల చించివేత విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే పోలీసులు స్పందించారు. థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకొని ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోకుండా బందోబ‌స్తే ఏర్పాటు చేశారు. దీనికి కార‌ణ‌మైన వారిని గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు