ప్రభాస్ విలన్.. చితగ్గొట్టేశాడుగా!

ప్రభాస్ విలన్.. చితగ్గొట్టేశాడుగా!

నిజ జీవిత కథలతో సినిమాలు తీసేటపుడు ఆయా పాత్రలకు తగ్గ నటీనటుల్ని ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వాళ్లుండరు. తన పాత్రకు సరిపోయే నటుల్ని ఎంచుకోవడమే కాదు.. వాళ్లను ఆ పాత్రలకు తగ్గట్లుగా మౌల్డ్ చేయడంలో వర్మ తన ప్రత్యేకతను చాటుకుంటుంటాడు. 'కిల్లింగ్ వీరప్పన్' కోసం సందీప్ భరద్వాజ్ అనే నటుడిని వీరప్పన్ లాగా ఎలా మార్చాడో తెలిసిందే.

ఆ లుక్ చూసి అందరూ షాకైపోయారు. ఇప్పుడు అలాంటి లుక్కే మరొకటి బయటికి వచ్చింది. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జన్సీ నాటి చీకటి రోజుల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్ 'ఇందు సర్కార్' అనే సెన్సేషనల్ మూవీ తీసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఇందిర పాత్ర కోసం సుప్రియ వినోద్ అనే నటికి అద్భుతమైన మేకప్ వేశారు. ఐతే ఆమెను చూసే అందరూ ఆశ్చర్యపోతుంటే.. సంజయ్ గాంధీ పాత్ర కోసం మరో నటుడి మేకోవర్ చూసి మరింతగా షాకవుతున్నారు. ఈ పాత్రను బాలీవుడ్ హీరో.. ప్రభాస్ కొత్త సినిమా 'సాహో'లో విలన్‌గా నటించబోతున్న నీల్ నితిన్ ముఖేష్‌ను ఎంచుకోవడం విశేషం. అసలు మామూలుగా చూస్తే నీల్ నితిన్.. సంజయ్ గాంధీ పాత్రకు సరిపోతాడా అనుకుంటాం కానీ.. 'ఇందు సర్కార్' కోసం అతడిని అచ్చం సంజయ్ గాంధీలా తీర్చిదిద్ది అందరికీ షాకిచ్చింది చిత్ర బృందం.

ఈ చిత్రం నుంచి ఓ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశాడు మాధుర్ భండార్కర్. అందులో అచ్చంగా సంజయ్ గాంధీని తలపించే లుక్స్‌తో, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టేశాడు నీల్ నితిన్. ఈ సినిమా ట్రైలరే కాక.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన సాంగ్ వీడియో కూడా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల్లో ఈ సినిమా గుబులు రేపుతోంది. ఎమర్జెన్సీ రోజుల్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలన్నింటినీ ఈ సినిమాలో మాధుర్ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడని ట్రైలర్లోనే స్పష్టమైంది. జులై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు