రజినీకాంత్ హిందీలో మాట్లాడితే..

రజినీకాంత్ హిందీలో మాట్లాడితే..

సూపర్ స్టార్ రజినీకాంత్ స్వతహాగా మరాఠీ. ఆయనకు ఆ భాష వచ్చు. అలాగే హిందీలోనూ మాట్లాడగలరు. ఆయన ఉద్యోగం చేసింది బెంగళూరులో. కన్నడ కూడా అనర్గళంగా మాట్లాడలరు. రజినీకి తెలుగు కూడా తెలుసన్న సంగతీ తెలిసిందే. ఇక తమిళం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సూపర్ స్టార్ మామూలుగా తమిళంలో మాత్రమే డబ్బింగ్ చెప్పుకుంటారు.

వేరే భాషల్లోకి అనువాదమయ్యే ఆయన సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్ ఇస్తారు. తెలుగులో మనో డబ్బింగ్ చెబితే.. హిందీలో అక్కడి లోకల్ ఆర్టిస్టులు రజినీకి డబ్బింగ్ చెబుతుంటారు. ఐతే గతంలో రజినీ డైరెక్ట్ హిందీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. చివరగా ‘పెదరాయుడు’ హిందీ రీమేక్ ‘బులండి’లో రజినీ తన పాత్రకు తనే వాయిస్ ఇచ్చాడు.

ఐతే సుదీర్ఘ విరామం తర్వాత రజినీ మళ్లీ హిందీలో డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. రజినీ కొత్త సినిమా ‘కాలా’ ముంబయి బ్యాక్ డ్రాప్‌లో సాగే మాఫియా డాన్ కథ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మామూలుగానే చాలా హిందీ, మరాఠీ డైలాగులు ఉంటాయట. సినిమాలో ఒరిజినాలిటీ దెబ్బ తినకుండా ఉండేందుకు హిందీ, మరాఠీ డైలాగుల్ని అలాగే ఉంచబోతున్నారట.

అలాగే ‘కాలా’ హిందీ వెర్షన్‌కు రజినీ స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటాడట. ముంబయి నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్టవుతుందనే ఉద్దేశంతో రజినీ సొంతంగా డబ్బింగ్ చెప్పనున్నాడట. తెలుగు వెర్షన్‌కు మాత్రం యధావిధిగా మనోతోనే రజినీకి వాయిస్ ఇప్పిస్తారని సమాచారం. ‘కాలా’ వచ్చే ఏడాది వేసవిలో రిలీజయ్యే అవకాశముంది.