మహేష్ మీద కోర్టు ఆగ్రహం

మహేష్ మీద కోర్టు ఆగ్రహం

ఎప్పుడో రెండేళ్ల కిందట రిలీజైన మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’. దానికి సంబంధించిన కాపీ వివాదం ఇప్పటికీ ఈ చిత్ర దర్శక నిర్మాతల్ని వదలట్లేదు. తాను ‘స్వాతి’ వార పత్రికకు రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలను కాపీ కొట్టి ‘శ్రీమంతుడు’ సినిమా తీసినట్లు శరత్ చంద్ర అనే రచయిత ఆరోపించడం.. ‘శ్రీమంతుడు’ విడుదల తర్వాత అతను కోర్టుకెక్కడం తెలిసిన సంగతే.

ముందు ‘శ్రీమంతుడు’ టీం ఈ కేసును లైట్ తీసుకుంది. ఆఫ్ ద కోర్ట్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ వివాదం పరిష్కారం కాలేదు. కొన్ని నెలల కిందట శరత్ చంద్ర ప్రెస్ మీట్ పెట్టి.. తనకు డబ్బులు అక్కర్లేదని.. ‘శ్రీమంతుడు’ హిందీ వెర్షన్ టైటిల్స్‌లో తనకు కథకుడిగా క్రెడిట్ కావాలని అన్నాడు.

ఆ తర్వాత ఈ కేసు గురించి అప్ డేట్ లేదు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానందుకు హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్‌లపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వీరు చేసిన విన్నపాన్ని కోర్టు గతంలోనే తిరస్కరించింది. విచారణకు హాజరు కావాల్సిందేనంటూ వారికి సమన్లు జారీ చేసింది.

అయినప్పటికీ ఈ ముగ్గురూ తర్వాతి వాయిదాకు కోర్టుకు హాజరు కావడంతో వారిపై ఆగ్రహం చేసినట్లు సమాచారం. దీంతో కేసు మరింత జఠిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ నిర్మాణ భాగస్వామి కావడంతో అతడి మీదా కేసు నమోదైంది. మరి ఈ వివాదాన్ని ఇంకెంత కాలం సాగదీస్తారో.. కేసుకు ఎలా తెరదించుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు