బాబు దెబ్బ‌తో జ‌గ‌న్‌లో చురుకు పుట్టిందా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం త‌న వైఖ‌రి మార్చుకున్నారు. ప్ర‌భుత్వం చేసేది ప్ర‌జ‌ల‌కు చెప్పాలంటూ.. అధికారుల‌కు చెబుతున్నారు. అంతేకాదు.. త‌న అనుకూల మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌ప‌డాలంటూ.. లేఖ‌లు సైతం రాశారు. మ‌రి దీనికి కార‌ణం.. ఏంటి? అంటే.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న అనుచ‌రులు చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారం వ‌ర్కవుట్ అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన మౌలిక స‌దుపాయాలు లేక పోవడంతో వారు తీవ్ర‌స్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు ప్ర‌తిప‌క్షం టీడీపీ జోరుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిత్యం మాజీ సీఎం.. స‌హా.. అనేక మంది నాయ‌కులు.. పెద్ద ఎత్తున మీడియాలో కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ్యాక్సిన్ స‌హా.. ఇత‌ర అంశాల‌ను వివ‌రిస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వం ఎంత చేస్తున్నా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు. ప్ర‌భుత్వం చేసే విష‌యాలు ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం లేదు. దీంతో జ‌గ‌న్ అలెర్ట్ అయ్యారు. వెంట‌నే అధికారుల‌ను ఆయ‌న రంగంలోకి దింపారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నా ఎన్ని విక్రయించాలనేది కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోందన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్నీ కేంద్రమే నిర్ణయిస్తోందని, ఆ కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అది కూడా డబ్బులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఇవే విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. అయితే.. ఇంత చేస్తున్నా.. మంత్రులను, ఎమ్మెల్యేల‌ను మాత్రం సీఎం ప‌ట్టించుకోక‌పోవ‌డానికి రీజ‌నేంటి ? అనేది మ‌రో ప్ర‌శ్న‌. కేవ‌లం అధికారుల‌ను మాత్ర‌మే న‌మ్ముకుని జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేల్లో చాలా మంది సైలెంట్‌గానే త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు.