ముద్ర ఏది దువ్వాడ శంకరా?

ముద్ర ఏది దువ్వాడ శంకరా?

'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రానికి టాక్‌ సరిగా రాకపోయినప్పటికీ ఓపెనింగ్స్‌ బాగా వచ్చేసరికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెగ ఉత్సాహ పడిపోతున్నాడు. తన కెరియర్‌లోనే కాకుండా అల్లు అర్జున్‌ కెరియర్‌లో కూడా హయ్యస్ట్‌ గ్రాసర్‌ అవుతుందని అంటూ తన చిత్రాన్ని విమర్శించిన వారిపై విసుర్లతో చెలరేగిపోయాడు.

ఇక్కడ ఈ చిత్రానికి వస్తోన్న ఓపెనింగ్స్‌ అల్లు అర్జున్‌ ఘనతే తప్ప సినిమాదో, దర్శకుడిదో కాదని గుర్తించాలి. లాంగ్‌ వీకెండ్‌ వచ్చినపుడు, చాలా కాలంగా పెద్ద సినిమాలు లేని సీజన్‌ కలిసొచ్చినపుడు, కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే టెంప్లేట్‌తో చేసిన సినిమా అయినపుడు వసూళ్లు ఖచ్చితంగా వచ్చి పడిపోతాయి. తద్వారా సదరు హీరోకి వున్న పుల్‌ ఏమిటనేది తెలుస్తుంది కానీ దర్శకుడికి దక్కే క్రెడిట్‌ ఏమీ వుండదు.

మాస్‌ సినిమా తీస్తే బోయపాటి శ్రీను తీయాలి, లేదా వి.వి. వినాయక్‌ తీయాలంటూ వాళ్లకో బ్రాండ్‌ వుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో త్రివిక్రమ్‌ తనదైన ముద్ర వేసాడు. గ్రాండియర్‌ ఉట్టిపడే చిత్రాలతో రాజమౌళి ఎవరికీ అందనంత ఎత్తులో వున్నాడు. ఎమోషనల్‌ కథలతో, మాస్‌ హీరోయిజమ్‌తో కొరటాల శివ ప్రతి సినిమాతోను తన బాణీ చాటుకుంటున్నాడు. ఇలా అగ్ర పథంలోకి వెళ్లిన ప్రతి దర్శకుడికీ ఒక ముద్ర అంటూ వుంది.

తమదైన ముద్ర వేస్తూ ఎంటర్‌టైనర్లు తీర్చిదిద్దడం వేరు, పులిహోర కథలు వండి పాస్‌ అయిపోవాలని చూసే ఎస్కేపిజం వేరు. రివ్యూలకి రెవెన్యూతో సమాధానమిస్తున్నామనే సంబరాలు అటుంచి, దర్శకుడిగా ప్రతి సినిమాతో ప్రేక్షకుల నమ్మకం ఎంత చూరగొన్నాం, ప్రతి చిత్రంతో మనదైన ముద్ర ఏ మేరకు వేసామనేది తర్కించుకుంటే బెటరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు