మోడీ గురించి తన‌కేం తెలుసో చెప్పిన ట్రంప్

మోడీ గురించి తన‌కేం తెలుసో చెప్పిన ట్రంప్

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్ర‌శంస‌లు కురిపించారు. వైట్‌హౌజ్ ఒవెల్ రూమ్‌లో ఇద్ద‌రూ ముచ్చ‌టించారు. ఆ స‌మ‌యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీపై త‌న‌కు ఉన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడీ గురించి చాలా చ‌దువుతున్నాన‌ని, ఆయ‌న చూపిస్తున్న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు అద్భుత‌మ‌ని ట్రంప్ కొనియాడారు. మోడీ గొప్ప ప్ర‌ధాని అని, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లుతున్నార‌ని ట్రంప్ మెచ్చుకున్నారు. ఎన్నో ర‌కాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లుతున్న ఘ‌న‌త మోడీకి ద‌క్కుతుంద‌ని, ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెబుతున్నాన‌ని ట్రంప్ ప్ర‌ధానితో షేక్ హ్యాండ్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యేందుకు వైట్ హౌజ్ చేరుకున్న స‌మ‌యంలో. ట్రంప్‌ దంపతులు వైట్‌ వద్ద మోడీకి స్వాగతం పలికారు. రక్షణ, వాణిజ్య, ఉగ్రవాదంపై ఇరుదేశాల నేతలు చర్చించారు. సమావేశం తర్వాత ట్రంప్‌, మోడీ ఉమ్మడి ప్రకటన చేశారు. ట్రంప్‌తో భేటీ అనంతరం మోడీ మాట్లాడుతూ భారత్‌-అమెరికా ఆర్థిక పరిపుష్టికి శ్రమిస్తున్నామని అన్నారు. పరస్పర సహకారంతో వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు ప్రధాన అంశాలని, సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక అవగాహన రంగాలపై దృష్టి పెట్టామని చెప్పారు.

సాంకేతికత, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనలో పరస్పర సహకారం ఉంటుందని తెలిపారు. డిజిటల్‌ రంగంలో భాగస్వామ్యాన్ని బలపరుచుకుంటామని చెప్పారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపనకు భారత్‌ కట్టుబడి ఉందని, శాంతి స్థాపన ద్వారా అఫ్ఘానిస్థాన్‌ను పునర్‌నిర్మిస్తామని మోడీ స్పష్టం చేశారు. భారత్‌కు రావాలని ట్రంప్‌ కుటుంబ సభ్యులను మోడీ ఆహ్వానించారు. అబ్రహం లింకన్‌ తపాలా స్టాంప్‌ను ట్రంప్‌కు మోడీ బహుకరించారు. భారత్‌-అమెరికా రెండూ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులని, అమెరికాతో భారత్‌ స్నేహం మరింత బలపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమని తెలిపారు. ఉగ్రవాదంపై అమెరికాతో కలిసి పోరాడతామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి ఆదరణను మర్చిపోలేనని మోడీ చెప్పారు.

భారత్‌ అత్యంత ప్రాచీనదేశమని, తమకు సన్నిహితమైనదని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్‌, అమెరికా కలిసి పోరాడతాయని తెలిపారు. భారత్‌తో ఆర్థిక మైత్రి కొనసాగుతుందని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు