మామ రాజకీయారంగేట్రం.. అల్లుడేమన్నాడు?

మామ రాజకీయారంగేట్రం.. అల్లుడేమన్నాడు?

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయారంగేట్రం ఖరారైనట్లే. గత కొన్ని రోజుల్లో దీని గురించి బాగానే క్లారిటీ వచ్చింది. స్వయంగా రజినేనే తన పొలిటికల్ ఎంట్రీపై సానుకూల సంకేతాలిచ్చేశాడు. ఐతే సూపర్ స్టార్ తన రాజకీయ అరంగేట్రాన్ని ధ్రువీకరించగానే దీనిపై భిన్న రంగాల వ్యక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో రజినీ పొలిటికల్‌గా సూపర్ సక్సెస్ అవుతారని కొందరు అభిప్రాయపడితే.. కొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సినీ రంగం నుంచే భారతీరాజా, కస్తూరి, అమీర్ లాంటి వాళ్లు రజినీ రాజకీయ అరంగేట్రంపై విమర్శలు గుప్పించారు.

బయటి వాళ్ల సంగతలా ఉంచితే.. రజినీ అల్లుడైన ధనుష్ తన మామ రాజకీయ అరంగేట్రం గురించి ఏమంటాడో అన్న ఆసక్తి జనాల్లో ఉంది. ఈ టాపిక్ ఎత్తితే ధనుష్ పాజిటివ్ గా మాట్లాడతాడా.. నెగెటివ్ కామెంట్స్ చేస్తాడా.. లేక సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తాడా అని తమిళ జనాలు ఎదురు చూశారు. తన కొత్త సినిమా 'వీఐపీ-2' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ముంబయిలో అతడికి మీడియా వాళ్ల నుంచి రజినీ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

దీనికి అతను తెలివిగా బదులిచ్చాడు. తనను ప్రశ్నించిన విలేకరిని ఉద్దేశించి.. ''ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదో మీకొక అభిప్రాయం ఉండి ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని మీ వద్దే ఉంచుకోండి. అలాగే నా అభిప్రాయాన్ని నా దగ్గరే పెట్టుకుంటా'' అంటూ ధనుష్ పేలిపోయే ఆన్సర్ ఇవ్వడంతో ముంబయి ప్రెస్ వాళ్లు అక్కడితో సైలెంటైపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు