అప్పుడే సినిమా రెడీ చేసేశాడు

అప్పుడే సినిమా రెడీ చేసేశాడు

దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి పోరాడుతున్నాడు నాగార్జున మేనల్లుడు సుమంత్. మధ్య మధ్యలో కొన్నిసార్లు కుదురుకున్నట్లే కనిపించాడు కానీ.. మళ్లీ డౌన్ అయ్యాడు. సత్యం.. గోదావరి.. గోల్కొండ హైస్కూల్ లాంటి సినిమాలు అతడికి బ్రేక్ ఇచ్చినా.. ఆ విజయాల్ని నిలబెట్టుకోలేకపోయాడు సుమంత్.

గత కొన్నేళ్లలో అతడి కెరీర్ మరింతగా దెబ్బ తింది. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' తర్వాత రెండేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన సుమంత్.. ఈ ఏడాది 'నరుడా డోనరుడా'తో కొంతమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కానీ ఈ బాలీవుడ్ రీమేక్ మూవీ కూడా సుమంత్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది.

ఈ దెబ్బతో సుమంత్ కథ ముగిసినట్లే అనుకుంటుండగా.. ఈ మధ్యనే తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు సుమంత్. అతణ్ని నమ్మి బయటి నిర్మాతలు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం విశేషమే. ఈ సినిమా మొదలుపెట్టిన రెండు నెలలకే టాకీ పార్ట్ పూర్తి చేసుకోవడం విశేషం. నిన్నో మొన్నో సినిమాను మొదలుపెట్టినట్లుగా ఉండగా.. మధ్యలో షూటింగ్ గురించి ఏ అప్ డేట్ ఇవ్వకుండా నేరుగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు సుమంత్. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హిట్ మూవీ 'బద్రీనాథ్ కి దుల్హానియా' ఫేమ్ ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించింది. ఇందులో సుమంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా కనిపిస్తాడట. ఇందులో హీరో హీరోయిన్లు మూడు రకాల టైమ్ జోన్లలో ప్రేమలో పడతారట. కథ చాలా వెరైటీగా ఉంటుందట. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు