ఆ తమిళ సినిమా.. అచ్చం 'అడవి దొంగ' లాగే

ఆ తమిళ సినిమా.. అచ్చం 'అడవి దొంగ' లాగే

అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగే ఓ వ్యక్తి జనారణ్యంలోకి వచ్చి ఓ అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ వినగానే తెలుగు ప్రేక్షకులకు 'అడవి దొంగ' సినిమానే గుర్తుకొస్తుంది. హాలీవుడ్ టార్జాన్ సినిమాల స్ఫూర్తితో 'అడవి దొంగ' సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించింది చిరంజీవి-రాఘవేంద్రరావు బృందం.

ఆ సినిమా వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దాదాపు అదే తరహాలో తమిళంలో 'వనమగన్' అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు ఎ.ఎల్.విజయ్. జయం రవి, 'అఖిల్' భామ సాయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను తెరకెక్కించాడు విజయ్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలామందికి 'అడవి దొంగ' సినిమానే గుర్తుకొచ్చింది.

ఈ నెల 23న 'వనమగన్' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్నీక్ పీక్ అంటూ ఇందులోని ఐదు నిమిషాల స్పెషల్ సీన్ బయటికి వదిలింది చిత్ర బృందం. అడవి మనిషి అయిన జయం రవిని బంధించి తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి తాళం వేస్తే అతను గోడ బద్దలు కొట్టుకుని బయటికి వచ్చి.. చెట్టెక్కి పడుకుంటాడు. హీరోయిన్ అతణ్ని చూసి తెగ భయపడిపోతుంది. హీరోయిన్ సెల్ ఫోన్‌ను చూసి అదేంటో అని భయపడిపోయి దాన్ని నీళ్లలోకి విసిరేస్తాడు హీరో.

స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు చూసి తాగబోయి వాటి టేస్టు చూసి తూ అని ఊచేస్తాడు. మళ్లీ చెట్టెక్కి పడుకుంటాడు. ఈ సన్నివేశాలన్నీ చూస్తే 'అడవిదొంగ' గుర్తుకు రావడం సహజం. సినిమా అయితే సరదాగానే సాగేలా కనిపిస్తోంది. మరి ఈ మోడర్న్ 'అడవిదొంగ'ను తమిళ ప్రేక్షకులకు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు