అందరూ కలిసి కిషోర్‌ను హీరో చేసేసారు

అందరూ కలిసి కిషోర్‌ను హీరో చేసేసారు

‘అమీతుమీ’ సినిమాలో పేరుకే అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ హీరోలు. కానీ ఈ సినిమాలో అసలు హీరో ఎవరు అంటే.. మరో మాట లేకుండా వెన్నెల కిషోర్ పేరు చెప్పేయొచ్చు. వెన్నెల కిషోర్‌ను తీసేసి చూస్తే ‘అమీతుమీ’లో పెద్దగా ఏమీ కనిపించదు.

కిషోర్ లేని సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అసలు కిషోర్ ఎంట్రీ ఇచ్చాక సినిమా ఊపందుకుంటుంది. సినిమా ఎక్కడైనా కొంచెం ట్రాక్ తప్పుతోందంటే.. కిషోర్ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఉత్సాహం తీసుకొస్తాడు. అలా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడీ స్టార్ కమెడియన్. వెన్నెల కిషోర్ ఎంట్రీ కొంచెం ఆలస్యమవుతుంది కానీ.. ఓవరాల్‌గా లెంగ్త్ చూసుకుంటే మాత్రం హీరోల కంటే అతడికే ఎక్కువ ఉంటుంది.

ఈ విషయంలో మాత్రమే కాదు.. రిలీజ్ తర్వాత ప్రమోషన్ల వియంలోనూ వెన్నెల కిషోర్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా సరే.. అందుకు అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ చిన్నబుచ్చుకుంటున్నట్లుగా ఏమీ లేదు. ‘అమీతుమీ’ రివ్యూల్లో అయినా.. సోషల్ మీడియాలో సామాన్యుల స్పందన చూసినా.. వెన్నెల కిషోర్‌కే క్రెడిట్ ఇస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంతగా వెన్నెల కిషోర్ ప్రశంసలందుకుంటున్నాడు ఈ చిత్రానికి. ఇది గమనించే చిత్ర బృందం కూడా అతడినే ముందు పెట్టి సినిమాను ప్రమోట్ చేస్తోంది. అతడి ముఖచిత్రంతోనే సినిమాను ప్రమోట్ చేస్తోంది.

ఈ విషయంలో అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ అభ్యంతరాలేమీ చెబుతున్నట్లు లేదు. పైగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా అడివి శేష్.. కిషోర్‌ను ప్రశంసిస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లను రీట్వీట్ చేస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు. అతననే కాదు.. చిత్ర బృందమంతా కూడా వెన్నెల కిషోర్ విషయంలో ఇగో ఏమీ చూపించకుండా అతడినే ముందు పెట్టి సినిమాను ప్రమోట్ చేస్తోంది. సినిమా విజయంలో కిషోర్‌కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు