సంచ‌ల‌నంగా మారిన ఈనాడు వార్‌

సంచ‌ల‌నంగా మారిన ఈనాడు వార్‌

కొన్ని విష‌యాలు అంద‌రికి తెలిసిన‌వే. కానీ.. ఎవ‌రూ మాట్లాడ‌రు. అలాంటి వేళ‌.. ప‌వ‌ర్ ఫుల్ మీడియా ఒక‌టి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డితే.. వ్య‌వ‌స్థ‌లు ఒక్క‌సారి అలెర్ట్ కావ‌ట‌మే కాదు.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే వీలుంది. తెలుగు మీడియాలో త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించే ఈనాడు అచ్చేసిన తాజా క‌థ‌నం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు గ‌డ్డ మీద కొన్నేళ్లుగా మ‌ల్టీఫ్లెక్స్ దోపిడీ మొద‌లైంది. ఈ మ‌ధ్య‌న అది మ‌రింత పెరిగిపోయింది. స‌గ‌టు జీవికి సంతోషాన్ని క‌లిగించే సినిమాను భారంగా మార్చిన మ‌ల్టీఫ్లెక్స్ ల దోపిడీ మీద తాజాగా ఈనాడు చెల‌రేగిపోయిన తీరు ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. మిగిలిన థియేట‌ర్ల‌తో పోలిస్తే టిక్కెట్టు ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌ట‌మేకాదు.. అక్క‌డ అమ్మే తినుబండారాల ధ‌ర‌లు భారీగా ఉండ‌టం ప్రేక్ష‌కుడికి పెద్ద శాపంగా మారింది.

ఇవాల్టి రోజున కుటుంబంతో క‌లిసి మ‌ల్టీఫ్లెక్స్ లో సినిమాకు వెళితే.. జేబుకు ఎంత పెద్ద చిల్లు ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఉత్త పాప్ కార్న్ కే రూ.150 నుంచి రూ.200 వ‌ర‌కూ ఖ‌ర్చు చేయాల్సిన దుస్థితి. అన్నింటికి మించి మ‌రింత దారుణ‌మైన విష‌యం.. మంచినీళ్ల సీసా. బ‌య‌ట మార్కెట్లో ఎక్క‌డైనా లీట‌రు రూ.20 అయితే.. మల్టీఫ్లెక్స్‌ల్లో మాత్రం రూ.50 చొప్పున దోచేస్తుంటారు. అదేమంటే.. ఎంఆర్ పీ చూపించి.. రూల్ ప్ర‌కార‌మే అమ్ముతున్నాం క‌దా? అంటూ అతి తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శిస్తారు.

దీనిపై ఏమీ మాట్లాడ‌ని వేళ‌.. ఈనాడు ఈ రోజు చెల‌రేగిపోయింది. మ‌ల్టీఫ్లెక్సుల్లో ఎన్ని ర‌కాలుగా దోపిడీ చేస్తార‌న్న విష‌యాన్ని విఫులంగా త‌న క‌థ‌నంలో చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటితో సామాన్యుడు తీవ్రంగా మోసానికి గురి అవుతున్నార‌ని.. ఇలాంటి దోపిడీకి అడ్డుక‌ట్ట వేయాలంటూ త‌న క‌థ‌నంతో గ‌ళం విప్పింది. పాప్ కార్న్ తో పాటు.. కూల్ డ్రింక్స్..కాంబోల పేరిట ఎంతగా దోచేసుకుంటున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చెప్పుకొచ్చింది.

ఈనాడు పుణ్య‌మా అని.. తాజాగా మ‌ల్టీఫ్లెక్స్ దోపిడీ గురించి మ‌రోసారి చర్చించుకోవ‌టానికి అవ‌కాశం ల‌భించింద‌ని చెప్పొచ్చు. ఈ విష‌యం మీద స‌ద‌రు మీడియా సంస్థ గ‌ట్టిగా నిల‌బ‌డి.. ప్ర‌భుత్వాలు స్పందించే వ‌ర‌కూ వ‌రుస క‌థ‌నాలు కానీ అచ్చేస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కుల అంద‌రి నెత్తిన పాలు పోసిన‌ట్లు అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. మ‌ల్టీ ఫ్లెక్సుల దోపిడీపై రెండు ప్ర‌భుత్వాలు స్పందించి.. చ‌ర్య‌లు షురూ చేస్తే.. సినిమాను అభిమానించే వారంతా ఈనాడు చేసిన మేలును మ‌ర్చిపోర‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు