బ‌న్నీ మొదలెట్టేశాడు

బ‌న్నీ మొదలెట్టేశాడు

ఆచితూచి.. పొదుపుగా సినిమాలు చేయ‌టం కొంత‌కాలంగా టాలీవుడ్ హీరోల‌కు అల‌వాటుగా మారింది. కాస్త ఆల‌స్య‌మైనా.. అన్ని మంచిగా కుద‌రాల‌న్న ఆలోచ‌నో.. బ‌య‌ట‌కు చెప్ప‌లేని మ‌రింకేమైనా కార‌ణాలో కానీ.. దాదాపు అగ్ర‌హీరోలంతా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు తీయ‌టం.. ఒక సినిమా పూర్తి అయి.. రిలీజ్ అయ్యాక‌.. కాస్తంత గ్యాప్ తీసుకొని మ‌రో సినిమాకు ప‌ని చేయ‌టం మొద‌లు పెట్టి చాలాకాల‌మే అయ్యింది.

చివ‌ర‌కు స్టార్ డైరెక్ట‌ర్లు సైతం ఇదే బాట‌లో న‌డుస్తుండ‌టంతో.. పెద్ద హీరోలు.. అగ్ర ద‌ర్శ‌కుల సినిమాలు ఏడాదికి ఒక‌టి మాత్ర‌మే వ‌చ్చే ప‌రిస్థితి. కొద్ది మంది ఇందుకు మిన‌హాయింపు అయినా.. ఇండ‌స్ట్రీలో చాలామంది ఒక‌టి త‌ర్వాత ఒక‌టన్నట్లుగానే చేస్తున్నారు.

ఈ మ‌ధ్య‌న ఈ తీరు మారి.. సినిమా త‌ర్వాత సినిమా చేసేయ‌టం.. ఒక సినిమా నిర్మాణంలో ఉన్న‌ప్పుడే.. మ‌రికొన్నింటి ప్రాజెక్టుల గురించి చ‌ర్చ‌లు మొద‌లు పెట్ట‌టం షురూ అయ్యింది. ఒక‌రిని చూసి మ‌రొక‌రు అన్న‌ట్లుగా.. ఇప్పుడు అగ్ర‌హీరోలు అంతా కూడా వ‌రుస చిత్రాలు చేస్తున్నారు. ఆ జాబితాలో బ‌న్నీ కూడా చేరిపోయారు. తాజాగా ఆయ‌న హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర కెక్కుతున్న డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి అయి.. విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ చిత్రం ఈ నెలాఖ‌రులో విడుద‌ల కానుంది.
ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత గ్యాప్ లేకుండా మ‌రో చిత్రాన్ని చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ మెగా ఫ్యామిలీ మెంబ‌ర్ నాగ‌బాబు.. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ లు సంయుక్తంగా చేస్తున్న ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమాకు నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అన్న పేరును తొలుత అనుకున్నారు. త‌ర్వాత ఈ పేరు బాగోలేద‌ని.. దాన్ని మార్చాల‌ని అనుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అలాంటి మార్పు ఏమీ లేకుండానే మొద‌ట అనుకున్న పేరును క‌న్ఫ‌ర్మ్ చేసేశారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్ శేఖ‌ర్ సంగీతాన్ని ఇస్తున్నారు. డీజే విడుద‌ల కాక‌ముందే.. బ‌న్నీ మ‌రో సినిమాను చేస్తుండ‌టం ఆయ‌న అభిమానుల‌కు త‌ప్ప‌కుండా స్వీట్ న్యూసే అవుతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు