ఆ సినిమాను పవన్ వదిలేసినట్లేనా..

ఆ సినిమాను పవన్ వదిలేసినట్లేనా..

తన స్వీయ దర్శకత్వంలో ‘జానీ’ అనే సినిమా చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఐతే దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకోవాల్సిందే అన్న పట్టుదలతో ఆ తర్వాత ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ‘సత్యాగ్రహి’ అనే మరో సినిమాను పవన్ మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఆ చిత్రం.. సెట్స్ మీదికి వెళ్లకుండానే ఆగిపోయింది.

అప్పుడు రత్నంకు ఇచ్చిన కమిట్మెంట్‌ను అలా పక్కన పెట్టేసిన పవన్.. తాజాగా మరోసారి ఆయనకు హ్యాండ్ ఇచ్చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత తక్కువ వ్యవధిలో మూడు సినిమాల్ని లైన్లో పెట్టాడు పవన్. అందులో రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్‌తో సినిమా చేయాల్సిన సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ప్రారంభోత్సవ వేడుక కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు కదిలింది లేదు. దీంతో ఈ సినిమాపై అనేక సందేహాలు నెలకొన్నాయి.

ఆ సందేహాల్ని నిజం చేస్తూ ఇప్పుడీ సినిమాను పవన్ వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీని తర్వాత ప్రారంభోత్సవం జరుపుకున్న త్రివిక్రమ్ సినిమానే ముందు మొదలుపెట్టి పూర్తి చేస్తున్న పవన్.. ఆపై మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు.. పొలిటికల్ కమిట్మెంట్ల మధ్య రత్నం సినిమాను చేయడం కష్టమని.. ఆయనకు పవన్ అడ్వాన్స్ తిరిగిచ్చేశాడంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడి ‘ఆక్సిజన్’ సినిమాను ఆపేసిన రత్నం.. పవన్ సినిమా ముందుకు కదిలితే అన్ని సమస్యలూ పరిష్కరించుకోవచ్చనుకున్నారు. కానీ పవన్ ఆయన ఆశలకు తెరదించినట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English