చిరంజీవికి దాసరి స్వయంగా తినిపించిన వేళ..

చిరంజీవికి దాసరి స్వయంగా తినిపించిన వేళ..

దర్శకరత్న దాసరి నారాయణరావుతో చిరంజీవి బంధం ప్రత్యేకమైంది. వీళ్లిద్దరూ అత్యంత ఆత్మీయంగా ఉన్నట్లే ఉండేవారు. అదే సమయంలో అప్పుడప్పుడూ చిరును ఉద్దేశించి దాసరి సెటైర్లు వేసేవారు. ఐతే దాసరి చనిపోవడానికి ఏడాది కిందట్నుంచి చిరంజీవితో చాలా ఆత్మీయంగా ఉన్నారు.

చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు దాసరి ముఖ్య అతిథిగా వచ్చి.. చిరు గురించి గొప్పగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే తన పుట్టిన రోజు నాడు చిరు చేతుల మీదుగా అల్లు రామలింగయ్య అవార్డు తీసుకుని.. ఆ సమయంలోనూ చిరుతో చాలా ఆప్యాయంగా మెలిగాడు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ దాసరి మరణంపై చాలా ఉద్వేగానికి గురయ్యాడు చిరంజీవి.

తనకు అత్యంత ఆత్మీయుడైన దాసరి చనిపోయినపుడు తాను ఇక్కడ లేకపోవడం.. ఆయన్ని కడసారి చూసుకోలేకపోవడం తన జీవితంలో పెద్ద లోటుగా భావిస్తానని చిరు అన్నాడు. ఐతే దాసరి పాల్గొన్న చివరి పబ్లిక్ ఈవెంట్ తన ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంటేనని.. అలాగే ఆయన చివరిసారిగా మీడియాతో మాట్లాడింది కూడా అల్లు రామలింగయ్య అవార్డు అందుకున్నపుడే అని.. ఇవి తనకు ఎంతో సంతృప్తినిచ్చిన విషయాలని చిరు చెప్పాడు.

తాను ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే దాసరి గారి ఇంట్లో ఒక సమావేశం జరిగిందని.. దానికి హాజరై తిరి వెళ్తుంటే.. దాసరి తన ఇంట్లో భోంచేయకుండా వెళ్తే ఒప్పుకోనని అన్నారని.. ఆ సందర్భంగా మన జిల్లా నుంచి వచ్చిన బొమ్మిడాయిలతో చేసిన కూర అంటూ తనకు స్వయంగా వడ్డించి, తన చేత్తో తినిపించారని.. ఆ వాత్సల్యాన్ని మరిచిపోలేనని చిరు చెప్పాడు. దాసరి ఆసుపత్రిలో ఉండగా తాను పరామర్శకు వెళ్తే.. పేపర్ మీద ‘ఖైదీ నెంబర్ 150’ స్కోరెంత అని రాశారని.. తాను అది హైయెస్ట్ గ్రాసర్ అయిందని చెబితే చాలా సంతోషించారని.. తన సినిమా అంటే ఆయనకు అంత ఆసక్తి అని చిరు అన్నాడు.