దాసరిని చూద్దామంటే టికెట్ దొరకలేదట

దాసరిని చూద్దామంటే టికెట్ దొరకలేదట

దర్శకరత్న దాసరి నారాయణరావు కడచూపు కోసం రాని సినీ ప్రముఖులపై ఆయన శిష్యుడు మంచు మోహన్ బాబు తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. ఆయన చలవతో గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్లు ఆయన్ని కడసారి చూసుకోవడానికి రాకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. దాసరి సినిమాలతో హీరోయిన్లుగా గొప్ప స్థాయికి చేరుకున్న ఒకప్పటి తారల్ని పర్టి‌కులర్‌గా విమర్శించారు మోహన్ బాబు. ఈ మాటలు సీనియర్ నటి జయప్రదకు కూడా తగిలాయి. ఐతే దాసరి అంత్య క్రియలకు రాని జయప్రద.. ఆయన పెద్ద కర్మకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి కడసారి చూపుకు తాను ఎందుకు రాలేకపోయానో... ఆయనతో తనకున్న అనుబంధం ఎలాంటిదో వివరించారు జయప్రద.

‘‘దాసరి గారికి ఆపరేషన్‌ జరిగే ముందు ఆస్పత్రికి వెళ్లి కలిశాను. ‘ఆరోగ్యంతో ఇంటికి వస్తారు సార్‌.. గెట్‌ వెల్‌ సూన్‌’’ అంటే.. అలాగే అని నవ్వారు. కాసేపయ్యాక ఫ్లైట్‌కి టైమవుతోంది వెళ్లు జయా అన్నారు. దాసరి గారితో నేను మాట్లాడిన చివరి మాటలవే. నేను ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు. దాసరి గారు చనిపోయినప్పుడు ఇక్కడ లేను. చివరి సారి చూద్దామనుకుంటే ఫ్లైట్‌ టికెట్ దొరక్క రాలేకపోయాను. అందుకే ఈ రోజు పెద్ద కర్మకు హాజరయ్యాను. దాసరి గారు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ.. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. ‘విశ్వనాథ నాయకుడు’ షూటింగ్‌ జరుగుతున్నపుడు నేను ఒకరోజు ఆలస్యంగా షూటింగ్‌కి వెళ్లాను. మేకప్ వేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. లొకేషన్‌కు వెళ్లాక దాసరిగారు ఏం మాట్లాడలేదు. పాట షూటింగ్ మొదలైంది. డ్యాన్స్‌ మాస్టర్‌ చెప్పిన స్టెప్పులేశాను. మాస్టర్‌ ‘ఓకే’ అంటున్నారు కానీ, దాసరి గారు మాత్రం ‘కట్‌’ చెబుతూ ఉన్నారు. 15 టేక్స్ అయ్యాయి. సార్ ఏదైనా ప్రాబ్లెమా అని అడిగితే.. గట్టిగా నవ్వేసి నువ్వు లేటుగా వచ్చావు కదా జయా అందుకే ఇలా అన్నారు. నా మీద ఆయన అలిగారని అప్పుడు అర్థమైంది. ఇద్దరం నవ్వుకున్నాం. నేనెప్పుడు లొకేషన్‌కు వెళ్లినా.. ‘ఏంట్రా జయా... ఎలా ఉన్నావ్‌’ అని ఆప్యాయంగా పలకరించేవారు. ఇక ఆ పిలుపు వినపడదంటే బాధగా ఉంది’’ అని జయప్రద అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు