ఒకర్ని ప్రేమించా... అతనితోనే...

ఒకర్ని ప్రేమించా... అతనితోనే...


చీరకట్టుతో కనికట్టు చేసింది. మూతి ముడుపులతో మాయ చేసేసింది. అందుకే తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చేసింది...  సమంత. కెరీర్ మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాని సొంతం చేసుకుంది ఈ చెన్నై చిన్నది. ప్రస్తుతం తెలుగులో స్టార్ కథనాయకులందరికీ సమంతానే కావాలి. సినిమాలో ఆమె ఉంటే చాలు... బాక్సాఫీసులు కాసులతో కళకళలాడిపోతాయని నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే నాని దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ సమంతాతోనే ఆడిపాడుతుంటారు. ఇటీవల `అత్తారింటికి దారేది`, `రామయ్యా వస్తావయ్యా`లాంటి భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తోంది సమంత. ఈ ముద్దుగుమ్మ శనివారం హైదరాబాద్ లో గుల్టే.కామ్ తో ప్రత్యేకంగా సంభాషించింది. ఆ విషయాలివీ.

* సమంత సమంత సమంతా... ఎక్కడ చుసిమా మీ పేరే, ఏ థియేటర్ కి వెళ్ళినా మీ సందడే....
- మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నట్టున్నారు (స్మైల్ ).  ఇటీవల విడుదలైన రెండు పెద్ద సినిమాల్లోనూ నేనే కథానాయికగా నటించాను కదండీ. అందుకే ఏ థియేటర్కి వెళ్ళినా నేనే కనిపిస్తుంటాను. నా ప్లేస్ లో వేరొకరు నటించుంటే వాళ్ళే కనిపించేవారు. ఇక్కడ నా గొప్పదనం ఏమీ లేదు.

* వరసగా స్టార్ కథానాయకులతో కలిసి నటించడం అంటే మాటలు కాదు కదా మరీ...
- ఆ విషయంలో మొదట ప్రేక్షకులకు, ఆ తరవాత దర్శకనిర్మాతలకు కృతఙ్ఞతలు చెప్పాలి.  నాలో ఏం నచ్చిందో తెలియదు కానీ... తొలి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. వారి ఆదరణతోనే నేను ఇలా మంచి మంచి సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకోగలుగుతున్నా.

* చిన్న సినిమాలలో నటించాలనే ఆలోచనలు ఎప్పుడైనా  వస్తుంటాయా?
- ఆలోచనలు రావడం ఏంటండీ బాబూ. `ఎటో వెళ్ళిపోయింది మనసు` సినిమాలో నటించాను కదా. అలాగే `ఈగ` సినిమా కూడా సెట్స్ పైకి చిన్న సినిమాగానే వెళ్ళింది. విడుదలైన తర్వాతే  అది పెద్ద సినిమా అయ్యింది. చిన్న సినిమాల్లో నటించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆర్నెళ్ల క్రితం తమిళంలో చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఆరా తీశాను కూడా. ఇకపై పెద్ద సినిమాల్లో నటిస్తూనే చిన్న సినిమాలపై దృష్టి కేంద్రీకరించబోతున్నా.

* ఇంతకీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మీ సినిమాలకు ఎలాంటి ఆదరణ లభిస్తోందంటారు?
-  `అత్తారింటికి దారేది` సినిమా సాధిస్తున్న వసూళ్ళను బట్టి ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అర్థమై పోతుంది. ఇక  మొన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చిన `రామయ్యా వస్తావయ్యా` పక్కా మాస్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. తారక్ తో పాటు నేను కూడా సినిమాలో చాలా అందంగా కనిపించా.

* అన్నట్టు అందం గురించి మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు?
- అందం గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించే పిచ్చి ఇదివరకు ఉండేది. ఇప్పుడు మాత్రం అస్సలు లేదు. షూటింగ్ సమయంలో తప్ప మిగతా సమయంలో నా ఫేస్ ని అద్దంలో కూడా చూసుకోను.

* ఆ మార్పుకు కారణం ఏమిటంటారు?
- ఆ మధ్య మూడు నెలల పాటు అనారోగ్యంతో బెడ్ కే పరిమితమయ్యాను. ఆ సమయంలోనే నాలో మార్పు వచ్చింది. అందం, ఐశ్వర్యం కంటే గొప్ప విషయాలు చాలానే  ఉన్నాయనిపించింది. ఎప్పుడూ మనగురించే కాకుండా మన చుట్టూ ఉండే మనుషులు గురించి, సమాజం గురించి ఆలోచించాలనే ఓ ధృక్పథం ఏర్పడింది. అప్పట్నుంచి డబ్బు, అందం... తదితర విషయాల గురించి ఆలోచించడం మానేశా. సమాజ సేవపై దృష్టిపెట్టా. పరోపకారం చేయడంలోనే అందం, ఆనందాన్ని వెదుక్కుంటున్నా.

* సినిమాలతో తీరిక లేకుండా  గడుపుతున్నారు. మరి సమాజ సేవకు సమయం దొరుకుతుందంటారా?
- మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది. సమాజ సేవలో పాలు పంచుకుంటున్న సంస్థలో ఎన్నో ఉన్నాయి. వాటికీ అండగా నిలబడితే చాలు. మనం కూడా ఒక మహాయజ్ఞంలో పాలు పంచుకున్నట్టే లెక్క. ప్రత్యూష ఫౌండేషన్ కి నా తరపున చేతనైనంత సహాయం చేస్తున్నా.

* మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంటుంది?
- ఒక్కసారి కాదు. రోజూ... నేను ఎక్కడినుంచి ప్రయాణం మొదలుపెట్టానో గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది అవసరం కూడా. ఇప్పుడేదో నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాననీ, నాకు ఇదే శాశ్వతం అనీ, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాననీ అస్సలు అనుకోకూడదు. ఆ ఆలోచనని కలలో కూడా రానీయను. నేను కూడా ఒకప్పుడు చేయి చాచి వేరొకరి సాయం అడిగినదాన్నే. డబ్బు, విలాసవంతమైన కార్లు... ఇలా ఎన్ని ఉన్నా నేను అత్యంత సాధారమైన జీవితాన్నే గడుపుతుంటాను.

* ఆ మధ్య సమంతా పెళ్లి చేసుకుంటోంది అని ప్రచారం సాగింది. నిజమేనా? పెళ్లి గురించి ఏమైనా ప్రణాళికలున్నాయా?
- ఎవ్వరికీ చెప్పకుండా దొంగచాటు పెళ్లి అస్సలు చేసుకోను. నా పెళ్లి ఫిక్స్ అయితే తప్పకుండా మీకే మొదట చెబుతా. పెళ్లిమాటేమో ప్రేమలో పడిన మాట మాత్రం వాస్తవమే.  దాన్ని మాత్రం దాచిపెట్టను. ఇప్పటిదాకా ఒక్కరినే ప్రేమించా, వాళ్ళతోనే జీవితం పంచుకుంటా.

* చిత్రసీమలో మీకు మంచి స్నేహితులంటే ఎవరు?
- చాలా మంది ఉన్నారు. `అత్తారింటికి దారేది` సినిమా నుంచి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులయ్యారు. నేను తలపెట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు పవన్ తనవంతుగా `గబ్బర్ సింగ్` సినిమాలోని డ్రెస్ ని ఇచ్చాడు. అలాగే మహేష్ బాబు కూడా `దూకుడు` సినిమాలోని దుస్తులను వేలం పాటకోసం పంపారు.

* తరచుగా ఇద్దరు కథానాయికలతో కలిసి తెరను పంచుకుంటూ ఉంటారు. ఆ విషయంలో మీకు ఇబ్బందులేమీ లేవా?
- నా ఇబ్బందుల సంగతి తర్వాత.  తెలుగు ప్రేక్షకులకు ఇద్దరు కథానాయికలు ఉంటే  కానీ సినిమా నచ్చడం లేదు కదా (స్మైల్). అందుకే దర్శకులు ఇద్దరు కథానాయికలతో సినిమాలు తీస్తున్నారు. వాటిలో మేం నటించాల్సి వస్తోందంతే.

* కథానాయికగా ఇంకా ఎంతకాలం కొనసాగాలని అనుకుంటున్నారు?
- ఏ మీకేమైనా బోర్ కొట్టేశానా? (స్మైల్).  అయినా చిత్ర పరిశ్రమలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవ్వరూ చెప్పలేం. ఎప్పుడూ ఇలాగే పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తానని నేను అస్సలు అనుకోను. నా హవా సాగినంత కాలం నటిస్తాను. ఆ తర్వాత పక్కకి తప్పుకుంటా. అంతే కానీ ప్రత్యేకంగా ఫలానా సమయంవరకు నటించాలనే నియమాలేమీ నాకు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు