చిన్న సినిమా.. దున్నేసుకోవచ్చు

చిన్న సినిమా.. దున్నేసుకోవచ్చు

అమీతుమీ.. ఈ సినిమా మొదలైనపుడు కానీ.. షూటింగ్ పూర్తి చేసుకున్నపుడు కానీ.. ట్రైలర్ రిలీజైనపుడు కానీ దీనిపై పెద్దగా అంచనాల్లేవు. ఐతే మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దీని రేంజే మారిపోయేలా కనిపిస్తోంది. పెట్టుబడి మీద భారీగానే లాభం తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది ‘అమీతుమీ’. ఈ రోజుల్లో ఓ చిన్న సినిమా సోలోగా రిలీజవడం చాలా చాలా కష్టం. పెద్ద సినిమాలకు మాత్రమే ఆ ఛాన్సుంటుంది.

పెద్ద సినిమాలు పోటీలో లేనపుడు వీకెండ్లో చిన్న సినిమాలు రెండు మూడైనా రిలీజవుతుంటాయి. ఐతే అనుకోకుండా ‘అమీతుమీ’కి పోటీ తప్పిపోయింది. ముందు జూన్ 9న అనుకున్న ‘దర్శకుడు’ వాయిదా పడగా.. నిన్న ‘అమీతుమీ’తో పాటే విడుదలకు సిద్ధమైన ‘ఆరడుగుల బుల్లెట్’ ఆర్థిక కారణాలతో అనూహ్యంగా రేసు నుంచి తప్పుకుంది. అదే సమయంలో ‘అమీతుమీ’ పాజిటివ్ టాక్‌తో మొదలైంది. సినిమా గొప్పగా ఏమీ లేకపోయినా.. కేవలం వెన్నెల కిషోర్ కామెడీ కోసం డబ్బులు పెట్టేయొచ్చన్న టాక్ స్ప్రెడ్ అయింది. ‘అమీతుమీ’కి మామూలుగా వచ్చిన ప్రేక్షకులతో పాటు ‘ఆరడుగుల బుల్లెట్’ కోసం వచ్చి నిరాశకు గురైన వాళ్లూ ఈ సినిమా వైపు మళ్లడంతో తొలి రోజు ఈ సినిమా జనాలతో కళకళలాడింది.

గత వారాంతంతో పోలిస్తే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ జోరు తగ్గిపోవడం.. ‘బాహుబలి-2’ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయిన నేపథ్యంలో ‘అమీతుమీ’ ఈ వీకెండ్లో బాక్సాఫీస్ లీడర్ గా నిలిచే అవకాశముంది. చాలా పరిమిత లొకేషన్లలో.. తక్కువ రోజుల్లో.. పూర్తి చేయడం వల్ల ‘అమీతుమీ’కి తక్కువ ఖర్చుతో పూర్తయింది. పారితోషకాలతో కలిపి సినిమాకు రూ.2 కోట్లకు మించి కాలేదంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పెట్టబడి మీద కొన్ని రెట్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు