ఇంద్రగంటి ఆమె గురించి ఓపెనయ్యాడు

ఇంద్రగంటి ఆమె గురించి ఓపెనయ్యాడు

ఒక దర్శకుడు వరుసగా ఒకే హీరోయిన్‌తో సినిమాలు చేస్తుంటే జనాలకు రకరకాల డౌట్లు వచ్చేస్తాయి. ఏవేవో రూమర్లు వినిపిస్తాయి. క్లాస్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఆయన పరిచయం చేసిన ఈషా విషయంలోనూ ఇలాంటి వార్తలు కొన్ని వచ్చాయి.

ఇంద్రగంటి సినిమా 'అంతకుముందు ఆ తరువాత'తో ఈషా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే 'బందిపోటు' చేసింది. ఇప్పుడు ఇంద్రగంటి నుంచి వస్తున్న 'అమీ తుమీ'లోనూ ఆమే హీరోయిన్. మొత్తంగా ఇంద్రగంటి రీసెంట్‌గా చేసిన నాలుగు సినిమాల్లో మూడింట్లో ఈషానే కథానాయిక.

ఈషా మీద ఇంద్రగంటి చూపించే ప్రత్యేక అభిమానం గురించి మీడియా వాళ్లకు కూడా డౌట్లు వచ్చేసి.. 'అమీతుమీ'ను ప్రమోట్ చేయడం కసం వచ్చినపుడు ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన ఏమని బదులిచ్చారంటే..
''ఈషా అచ్చ తెలుగు అమ్మాయి. ఇటు ఆంధ్రా.. అటు తెలంగాణ.. రెండు యాసలూ బాగా మాట్లాడగలదు. ముఖ్యంగా తెలంగాణ యాస మాట్లాడే తెలుగు హీరోయిన్లు చాలా అరుదు. ఆ అమ్మాయి మంచి నటి కూడా. నా పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఆమెలో ఉన్నాయి. తెలుగు రాని ఓ హీరోయిన్ని తీసుకుని.. తనకు తెలుగు నేర్పించి.. వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించి ఇబ్బంది పడటం ఎందుకని ఈషానే 'అమీ తుమీ'కి తీసుకున్నాను. ఇంతకుముందు తనకు సరిపోయే పాత్రలు కాబట్టే తనతో చేయించాను. నా సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటీనటులే ఉంటారు. నా సినిమాల్లోనూ తెలుగుదనం ఉంటుంది. అందుకే తెలుగు నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను'' అంటూ ఈషాకు వరుసగా అవకాశాలిస్తుండటానికి కారణమేంటో చెప్పాడు ఇంద్రగంటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు