చైనాలో చిరు.. ఇలా ఎంజాయ్ చేశాడు

చైనాలో చిరు.. ఇలా ఎంజాయ్ చేశాడు

దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆయన చైనా నుంచి తన సంతాప సందేశాన్ని పంపించారు. సినిమా షూటింగులేమీ లేకుండా ఖాళీగా ఉన్న చిరు ఇప్పుడు చైనాకు ఎందుకెళ్లాడా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఐతే కొద్దిమందికే తెలుసు ఆయన ఓ స్పెషల్ వెకేషన్ కోసం వెళ్లారని.

80ల నాటి తారలందరూ కలిసి ప్రతి సంవత్సరం రీ యూనియన్ పేరుతో కలవడం ఆనవాయితీ. ప్రతిసారీ చెన్నైలో ఈ కలయిక ఉండేది. ఐతే ఈసారి వేదిక మారింది. తొలిసారిగా ఫారిన్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వెకేషన్ లాగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. రాధికా శరత్ కుమార్.. లిజి.. భాగ్యరాజ్.. ఇలా కొందరు దక్షిణాది సినీ ప్రముఖులు చిరుతో పాటు చైనాకు వెళ్లారు.

వీళ్లంతా కలిసి వారం రోజులకు పైగా చైనాలో వివిధ ప్రాంతాలు తిరిగి ఎంజాయ్ చేశారు. అందులో కొన్ని ఫొటోల్ని మీడియాకు రిలీజ్ చేశారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కోసం గడ్డం పెంచి కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడిందులో. చిరు గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు.

ఆయన రేపో ఎల్లుండో దాసరి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని సమాచారం. ఆగస్టులో చిరు పుట్టిన రోజు నాడు 'ఉయ్యాలవాడ' సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు