ఆసుపత్రి బెడ్‌పై.. మృతదేహం పక్కనే..

ఇది కొవిడ్ టైం. కరోనాతో ఎవరైనా చనిపోతే దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడిపోతాం. ఇక మనకు కూడా కరోనా లక్షణాలు ఉన్నపుడు.. వైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూస్తే కంపించిపోతాం. అలాంటిది కరోనా చనిపోయిన ఓ వృద్ధుడి పక్కనే పడుకుని రెండు గంటల పాటు అత్యవసర స్థితిలో ఆక్సిజన్ ఎక్కించుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. ఈ భయానక అనుభవాన్ని అనంతపురం జిల్లాలో ఒక యువకుడు ఎదుర్కొన్నాడు.

అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు సరిపడా బెడ్లు లేకపోయాయి. దీంతో ఒకే బెడ్ మీద ఇద్దరిద్దరిని పడుకోబెట్టి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే గురువారం ఉదయం అనంతపురం జిల్లా కణేకల్లు మండలానికి చెందిన సుంకన్న అనే వృద్ధుడికి శ్వాస అందని పరిస్థితుల్లో ఈ ఆసుపత్రిలో చేరాడు. ఓ యువకుడికి ఆక్సిజన్ అందిస్తున్న బెడ్ మీదే ఈ వృద్ధుడిని కూడా పడుకోబెట్టారు. ఆయనకు కూడా ఆక్సిజన్ అమర్చారు. ఐతే కొన్ని గంటల్లోనే ఆ వృద్ధుడి పరిస్థితి విషమించింది.

ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఐతే కొవిడ్ మృతి కావడంతో బంధువులు అక్కడికి చేరుకోలేకపోయారు. మృతదేహాన్ని తరలించే సిబ్బంది రావడానికి రెండు గంటలు పట్టింది. ఆ రెండు గంటలు ఎవరూ ఆ వృద్ధుడి మృతదేహాన్ని ముట్టుకునే సాహసం చేయలేకపోయారు. ఆ యువకుడికి ఆక్సిజన్ అత్యవసరం కావడంతో అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేకపోయింది. దీంతో రెండు గంటల పాటు మృతదేహం పక్కనే పడుకుని అతను ఆక్సిజన్ అందుకున్నాడు. ఊహించుకోవడానికి కూడా వణుకు పుట్టే పరిస్థితి ఇది. రాష్ట్రంలో బెడ్లకు కొరత లేదని.. ఆక్సిజన్‌కు లోటు లేదని.. వెంటిలేటర్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వం ఒక వైపు ఘనంగా ప్రకటన చేస్తుంటే.. వాస్తవంగా క్షేత్ర స్థాయిల్లో ఉన్న దుస్థితికి ఇది నిదర్శనం.