ఆ క్రికెటర్ పరిస్థితి దయనీయం

వేద కృష్ణమూర్తి.. భారత మహిళల క్రికెట్‌ను అనుసరించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ ఆల్‌రౌండ్ క్రికెటర్ భారత్ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న వేద.. తన కుటుంబంలో వరుస విషాదాలతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఆమె కుటుంబంలో జరిగిన ఘోరాలు తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.

కర్ణాటకలోని కాడూర్‌లో నివసించే వేద కుటుంబంలో ఒకేసారి పలువురు కరోనా బారిన పడ్డారు. ఆమె తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు.. ఇలా వరుసగా ఒక్కొక్కరు కొవిడ్ పాజిటివ్‌గా తేలారు గత నెలలో. వీరిలో కొందరు కోలుకోగా.. కొందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ముందుగా గత నెల 23న వేద తల్లి కరోనాతో కన్ను మూసింది. అప్పుడు తన సోదరి సైతం ఇబ్బందికర స్థితిలో ఉందని.. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని, తాను కరోనా నెగెటివ్‌గా తేలానని వేద ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఐతే వేద సోదరి వత్సల కొన్ని రోజులకు కాస్త కోలుకున్నట్లే కనిపించింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని కూడా వార్తలొచ్చాయి. కానీ తర్వాత మళ్లీ తన పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ మీద ఉంటూ చికిత్స పొందుతున్న వత్సలకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమై ఊపిరి ఆడని పరిస్థితుల్లో కన్ను మూసింది. రెండు వారాల కిందటే తన తల్లి చనిపోయిందని, ఇప్పుడు సోదరికి కూడా తన కుటుంబం వీడ్కోలు చెప్పాల్సి రావడంతో తన కుటుంబం, తన ప్రపంచం కుదుపునకు లోనైందని వేద ట్విట్టర్లో పేర్కొంది.

కోవిడ్‌తో చికిత్స పొందుతూ మరణించడంతో తన తల్లితో పాటు సోదరిని వేద చివరి చూపు కూడా చూసుకోలేకపోయింది. నెల కిందటి వరకు సంతోషంగా ఉన్న వేద కుటుంబంలో ఇప్పుడు రెండు ప్రాణాలు కొవిడ్‌కు బలికావడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. వీరి పరిస్థితి తెలిసి సన్నిహితులు, శ్రేయోభిలాషులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా దయనీయమే.