బావ.. మరదలు.. బ్లాక్‌బస్టర్‌?

బావ.. మరదలు.. బ్లాక్‌బస్టర్‌?

రజనీకాంత్‌ ఎంత పెద్ద స్టార్‌ అయినా, ఆయన అల్లుడు ధనుష్‌ జాతీయ ఉత్తమ నటుడనిపించుకున్నా ఈ ఫ్యామిలీలో చిన్న వెలితి ఏమిటంటే రజనీ కూతుళ్లు సినిమా రంగంలో ఎలాంటి ముద్ర వేయలేకపోవడం. రజనీ పెద్ద కూతురు, ధనుష్‌ భార్య ఐశ్వర్య పలుమార్లు దర్శకురాలిగా సక్సెస్‌ అవ్వాలని చూసింది కానీ కాలం కలిసి రాలేదు.

ఆమె తీసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అలాగే రజనీ చిన్న కూతురు సౌందర్యకి గ్రాఫిక్స్‌ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరిక. ఆమె స్వీయ దర్శకత్వంలో రజనీకాంత్‌తో 'కొచ్చడయాన్‌' అనే యానిమేషన్‌ చిత్రం తీస్తే అది ఫ్లాప్‌ అయింది.

కొంత గ్యాప్‌ తర్వాత ఆమె మళ్లీ దర్శకురాలి అవతారమెత్తింది. ధనుష్‌ హీరోగా రూపొందుతోన్న 'విఐపి 2' చిత్రానికి దర్శకత్వం వహించింది. ధనుష్‌ నటించిన 'విఐపి' తమిళంలో పెద్ద హిట్‌ అవడమే కాకుండా తెలుగులో కూడా 'రఘువరన్‌ బీటెక్‌' పేరుతో అనువాదమై సక్సెస్‌ అయింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌కి కథ ధనుష్‌ రాస్తే, అతని మరదలు దర్శకత్వం వహించింది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కాజోల్‌ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రాన్ని న్యూస్‌లో వుంచడానికి టీజర్‌ని అమితాబ్‌తో రిలీజ్‌ చేయించారు. ధనుష్‌కి రాన్‌జనా చిత్రంతో హిందీలో హిట్‌ వుండడం, కాజోల్‌ కూడా నటించడంతో విఐపి 2ని హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. ఈసారైనా కూతురిని సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా చూడాలనే రజనీ కోరిక నెరవేరుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు