మ‌రో ఫ్యాన్స్ మీట్‌కి దేవుడి ఆదేశం!

మ‌రో ఫ్యాన్స్ మీట్‌కి దేవుడి ఆదేశం!

రీల్ డైలాగులు య‌థాత‌థంగా రియ‌ల్ లైఫ్‌లో ఉప‌యోగించే వారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. అలాంటి అవ‌కాశం త‌మిళ‌నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కే ద‌క్కింది. ఆ దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచ‌లం పాటిస్తాడంటూ ఆయ‌న చెప్పిన డైలాగ్ సినిమాల్లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ కాస్త స‌క్సెస్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఏళ్ల‌కు ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై న‌డుస్తున్న స‌స్పెన్స్ ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ శూన్య‌త నేప‌థ్యంలో.. ర‌జ‌నీ కానీ రాజ‌కీయాల్లోకి అడుగు పెడితే.. తిరుగులేని శ‌క్తిగా మార‌తార‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. ఆయ‌న పాలిటిక్స్ లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. అలా అని త‌న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేయ‌కుండా.. దేవుడి మాట‌ను తీసుకొచ్చి.. అవ‌కాశానికి త‌గిన‌ట్లుగా దేవుడ్ని వాడుకుంటున్న‌ట్లు అనిపిస్తోంది. మీరు పాలిటిక్స్ లోకి వ‌స్తారా? అన్న ప్ర‌శ్న‌కు.. ర‌జ‌నీ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అవుతూ.. అది దేవుడి నిర్ణ‌యం అయితే అదే జ‌రుగుతుందంటూ స‌మాధాన‌మిచ్చారు. కొన్నేళ్ల త‌ర్వాత నిర్వ‌హించిన ఫ్యాన్స్ మీట్ లో ర‌జ‌నీ పొలిటిక‌ల్ కెరీర్ స్టార్ట్ అయినట్లుగా చెప్పే వారు లేక‌పోలేదు. ఫ్యాన్స్ మీట్ లో కీల‌క  ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న అంచ‌నాలు వినిపించినా.. అలాంటిదేమీ లేకుండానే కార్య‌క్ర‌మాన్ని ముగించేశారు. తాజాగా.. మ‌రో ఫ్యాన్స్ మీట్ దిశ‌గా ర‌జ‌నీ అడుగులు వేస్తున్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే మ‌రోసారి త‌న అభిమానుల్ని ర‌జ‌నీ క‌ల‌వ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

ర‌జ‌నీ న‌టిస్తున్న కాలా షూటింగ్ ముంబ‌యిలో షురూ కావ‌టం తెలిసిందే. మొద‌టి షెడ్యూల్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న ర‌జ‌నీ చెన్నై రిట‌ర్న్ అయ్యారు.  మ‌ళ్లీ కొన్ని రోజుల్లో ప్రారంభ‌మ‌య్యే షూటింగ్ షెడ్యూల్ ముందు మ‌రో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది ఒక ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. త్వ‌ర‌లోనే రెండో ఫ్యాన్స్ మీట్‌ను నిర్వ‌హించి.. ఆ వెంట‌నే రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు అవ‌స‌ర‌మైన సాధ‌నా సంప‌త్తిని సిద్ధం చేస్తార‌ని చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఆగస్టులో దేవుడుఆదేశిస్తాడ‌ని.. ర‌జ‌నీ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశ వార్త‌ను అధికారికంగా వెల్ల‌డిస్తాడ‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ర‌జ‌నీ అభిమానుల‌కు నిజ‌మైన పండ‌గ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు