ఆ సర్జరీ వల్లే దాసరి చనిపోయారు

ఆ సర్జరీ వల్లే దాసరి చనిపోయారు

దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యం గురించి ఐదు నెలలుగా రకరకాల వార్తలొచ్చాయి. కిడ్నీల్లో సమస్య అన్నారు. అన్నవాహికలో ఇబ్బంది అన్నారు. ఇంకా ఏవేవో చెప్పారు. రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉండి పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చిన ఆయన.. ఇంతలో మళ్లీ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోవడం అందరికీ పెద్ద షాకే. అసలు దాసరికి ఏమైందన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఆర్నెల్ల కిందటి వరకు ఆరోగ్యం కనిపించిన ఆయన ఉన్నట్లుండి ఎందుకంత విషమ పరిస్థితిలోకి వెళ్లారో అర్థం కాలేదు. ఐతే బరువు తగ్గించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే దాసరి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారన్నది తాజా సమాచారం. ఈ విషయాన్ని దాసరి కూతురు హేమాలయ, అల్లుడు రఘు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

దాసరికి మామూలుగా పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవట. షుగర్ ఒక్కటే కంప్లైంట్ అని.. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటూ వచ్చారని.. ఐతే అధిక బరువు వల్ల వెన్ను నొప్పి వస్తోందని.. ఎక్కడా ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని.. ఆయాసం వచ్చేస్తుందని చెప్పి.. ఫిట్ గా అయ్యేందుకు ‘బెలూన్’ వేయించుకునే సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారట. ఈ సర్జరీ చేయించుకుంటే తిండి తినడం తగ్గి బరువు కూడా తగ్గుతానని ఆయన భావించారట. గతంతో మూడుసార్లు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందామని అనుకుని.. రేపు సర్జరీ అనగా ఈ రోజు వెనక్కి వచ్చేశారట దాసరి. ఐతే ‘బెలూన్’ వేయించుకునే చికిత్స వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని.. కాంప్లికేషన్స్ తక్కువని చెప్పడంతో దాసరి ఓకే అన్నారట. గత ఏడాది ఒకసారి ఈ సర్జరీ చేయించుకుని కొంత బరువు తగ్గిన దాసరి.. ఈ ఏడాది మరోసారి సర్జరీ చేయించుకుని.. మరింత బరువు తగ్గాలని అనుకున్నారట.

జనవరి 22న ఆసుపత్రికి వెళ్లి సర్జరీ చేయించుకున్న టైంలో.. అంతకుముందు సర్జరీ చేసిన వైద్యుడు లేడట. అయినా పర్వాలేదని దాసరి సర్జరీ చేయించుకున్నారట. అది పూర్తి చేసుకుని ఇంటికొచ్చాక సమస్యలు తలెత్తాయని.. ఆసుపత్రికి వెళ్తే సర్జరీ ఫెయిలైందని చెప్పారని.. ఆ సమయంలోనే ఆయన పరిస్థితి విషమించిందని.. అయినప్పటికీ వైద్యులు చాలా శ్రమించి ఆయన్ని ప్రాణాపాయం నుంచి బయటపడేశారని హేమాలయ, రఘు తెలిపారు. పొట్ట నుంచి ట్యూబ్ ద్వారా అన్నవాహికకు కనెక్ట్ చేసి ద్రవరూపంలో ఆహారం తీసుకునే ఏర్పాటు చేసి మార్చి నెలాఖర్లో ఇంటికి పంపారని.. ఐతే నోటి ద్వారానే ఆహారం తీసుకునేలా సర్జరీ చేయించుకోవడానికి ఈ మధ్య మళ్లీ దాసరి ఆసుపత్రికి వెళ్లారని.. దానికి సంబంధించి చేసిన శస్త్ర చికిత్స కూడా ఫెయిలవడంతో పరిస్థితి విషమించిందని.. కాంప్లికేషన్లు పెరిగిపోవడం.. అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పని చేయడం మానేయడంతో ప్రాణం పోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు దాసరి కూతురు, అల్లుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English