ఫ్లాపో డిజాస్టర్లో.. డిస్కషన్ కూడా లేదు

ఫ్లాపో డిజాస్టర్లో.. డిస్కషన్ కూడా లేదు

ఒక సినిమా ఫ్లాప్ కావచ్చు.. అట్టర్ ఫ్లాప్ కావచ్చు.. డిజాస్టరూ కావచ్చు.. కానీ దాని గురించి జనాల్లో ఎంతో కొంత చర్చ ఉండాలి. ముందు జనాలు థియేటర్లకు రావాలి. సినిమా చూడాలి. పక్కవాళ్లతో దాని గురించి డిస్కస్ చేయాలి. సోషల్ మీడియాలోనూ కొంత చర్చ ఉండాలి. కానీ ఒక లెజెండరీ డైరెక్టర్ తన దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్‌కు సీక్వెల్‌గా ఓ సినిమా తీస్తే దాని గురించి ఎక్కడా చర్చన్నదే లేదు.

ఇక్కడ మాట్లాడుతున్నది ‘ఫ్యాషన్ డిజైనర్’ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. వంశీ నుంచి గత దశాబ్ద కాలంలో వచ్చిన సినిమాలిచ్చిన ‘నమ్మకం’ కావచ్చు.. సుమంత్ అశ్విన్ ట్రాక్ రికార్డు చూసి కావచ్చు.. ఏ ప్రత్యేకతా లేని ట్రైలర్ వల్ల కావచ్చు.. ‘ఫ్యాషన్ డిజైనర్’ మీద అతి తక్కువ అంచనాలతో థియేటర్లకు వెళ్లారు జనాలు. అయినా కూడా నిరాశ తప్పలేదు. సినిమా చూసిన జనాలు విసుగెత్తిపోయినట్లున్నారు. దీని గురించి ఎక్కడా డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. సోషల్ మీడియాలో ‘ఫ్యాషన్ డిజైనర్’ హ్యాష్ ట్యాగ్ కొట్టినా సినిమా ఎలా ఉందని ఐడియా ఇచ్చే సమాచారం పెద్దగా దొరకట్లేదు.

ఈ సినిమాకు తొలి రోజు నుంచే బుకింగ్స్ లేవు. వీకెండ్లోనే ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా.. సోమవారం నుంచి దయనీయ స్థితికి చేరుకుంది. ముందు వారం వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈ వారం కూడా బాక్సాఫీస్ లీడర్‌గా ఉంటే.. ‘ఫ్యాషన్ డిజైనర్’కు పోటీగా వచ్చిన ‘అంధగాడు’ కూడా ఓ మోస్తరు వసూళ్లే రాబడుతోంది. నెల కిందటి ‘బాహుబలి-2’ కూడా మంచి వసూళ్లే సాధిస్తున్నా.. ‘ఫ్యాషన్ డిజైనర్’ మాత్రం నామమాత్రపు వసూళ్లతో సాగుతోంది. వంశీ ట్రాక్ రికార్డు గురించి పట్టించుకోకుండా ఆయనతో సినిమా తీసిన మధుర శ్రీధర్‌కు గట్టి పంచ్ పడినట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు