బాహుబలి నిర్మాతలు పెద్ద రిస్కే చేస్తున్నారు

బాహుబలి నిర్మాతలు పెద్ద రిస్కే చేస్తున్నారు

రాజమౌళి.. ప్రభాస్ మాత్రమే కాదు.. ‘బాహుబలి’ కోసం ఆ చిత్ర నిర్మాతలు కూడా ఐదేళ్ల పాటు అంకితమైపోయారు. ఆ ఐదేళ్లూ ఇంకే పని పెట్టుకోకుండా ‘బాహుబలి’ కోసమే తపించారు. ఐతే ఎట్టకేలకు ‘బాహుబలి’కి సంబంధించి తమ పని ముగియడంతో ప్రభాస్ ఇప్పటికే ‘సాహో’కు షిఫ్టయిపోగా.. రాజమౌళి తన కొత్త సినిమా కథ మీద ఫోకస్ పెట్టాడు. ఐతే నిర్మాతలకు మాత్రం ‘బాహుబలి’ విషయంలో ఇంకా పని మిగిలుంది. టీవీ సిరీస్.. వెబ్ సిరీస్.. గేమింగ్.. కామిక్స్.. వీఆర్ లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో ‘బాహుబలి’ని కొనసాగించడమే కాక.. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా మరిన్ని దేశాల్లో విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు ప్రొడ్యూసర్స్. దీంతో ఇప్పుడిప్పుడే ఇంకో సినిమా మీద వాళ్లు ఫోకస్ పెట్టే అవకాశం లేదనే అనుకున్నారంతా.

కానీ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘బాహుబలి’ పనిని కొనసాగిస్తూనే కొత్త సినిమాకు రంగం సిద్ధం చేశారు. యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా వాళ్లు తమ తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నారు. హీరో ఓకే కానీ.. ఈ చిత్రానికి ఎంచుకున్న దర్శకుడి విషయంలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘అనగనగా ఒక ధీరుడు’, ‘సైజ్ జీరో’ లాంటి డిజాస్టర్లు తీసిన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ‘సైజ్ జీరో’కు స్క్రిప్టు అందించిన ప్రకాష్ భార్య కనిష్కనే ఈ చిత్రానికీ ఆ బాధ్యతలు చేపడుతోందట.

ఈ చిత్రానికి రూ.40 కోట్ల దాకా బడ్జెట్ అనుకుంటున్నారని.. ఇదొక సోషియో ఫాంటసీ మూవీ అని అంటున్నారు. ప్రకాష్ ఆల్రెడీ ‘అనగనగా ఒక ధీరుడు’తో సోషియో ఫాంటసీ ట్రై చేసి ఫెయిలయ్యాడు. ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న అతడితో అంతేసి ఖర్చు పెట్టి మళ్లీ ఇంకో భారీ సినిమా అంటే పెద్ద రిస్కే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే తమకు టీవీ రంగంలో, సినిమాల్లో వెన్నుదన్నుగా నిలిచిన రాఘవేంద్రరావుకు కృతజ్నతగా బాహుబలి నిర్మాతలు ప్రకాష్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చినట్లున్నారు. ‘బాహుబలి’ ద్వారా సంంపాదించిందాంట్లో కొంత పోయినా పర్వాలేదని రంగంలోకి దిగుతున్నారో ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు