రామోజీ-దాసరి.. అసలెలా కలిశారు?

రామోజీ-దాసరి.. అసలెలా కలిశారు?

దర్శకుడిగా తిరుగులేని స్థాయిని అందుకున్న దాసరి నారాయణరావు ఆ రోజుల్లో చాలా ముక్కుసూటిగా ఉండేవారు. ఎవరికైనా ఎదురెళ్లడానికి రెడీగా ఉండేవారు. దాని వల్ల ఆయనకు కొందరు ప్రముఖులతో కయ్యాలు ఏర్పడ్డాయి. సినీ పరిశ్రమలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతోనూ ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. అలాగే మీడియా మొఘల్ రామోజీ రావుతోనూ ఓ దశలో దాసరికి తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.

దీంతో ‘ఈనాడు’తో పాటు రామోజీకి చెందిన మీడియా సంస్థలన్నింట్లోనూ దాసరిని బహిష్కరించారు. ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు ఎందులోనూ వచ్చేవి కావు. అలాగే దాసరి సినిమాల్ని ‘సితార’లో సమీక్షించాల్సి వస్తే.. దర్శకుడి ప్రస్తావన ఉండేది కాదు. ఈటీవీలో దాసరి సినిమాలు ప్రసారమైతే టైటిల్స్ లో దాసరి పేరు చూపించేవారు కాదని కూడా అంటారు. ‘ఈనాడు’కు పోటీగా దాసరి ‘ఉదయం’ పత్రికను తెచ్చి రామోజీ ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నాలు చేయడం కూడా తెలిసిందే. అలాగే మిగతా సినిమాల వాళ్లంతా ఫిలిం సిటీకి వెళ్తున్న సమయంలో దాసరి మాత్రం అటువైపు చూసేవారు కాదు. మరి అంతటి శత్రుత్వం ఉన్న వీళ్లిద్దరూ మళ్లీ ఎలా కలిశారు అన్నది చాలామందికి తెలియదు. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.

రామోజీతో విభేదాలు కొంత సద్దుమణుగుతున్న సమయంలోనే దాసరి నారాయణరావు తన సినిమా షూటింగ్ కోసం ఫిలిం సిటీకి వెళ్లాల్సి వచ్చింది. నిర్మాత వేడుకోలు మేరకు, మరో ప్రత్యామ్నాయం లేక ఫిలిం సిటీలో షూటింగ్‌కు ఓకే చెప్పాడు దాసరి. ఐతే ఆ సంగతి రామోజీకి తెలియడంతో ఆయన వెంటనే దాసరిని విందుకు ఆహ్వానించారు. దాసరి రాగానే స్వయంగా రామోజీ ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ పాత విభేదాలన్నింటినీ పక్కన పెట్టి స్నేహితులైపోయారు.

విందు ముగిశాక దాసరి బయటికి రాగానే.. అక్కడి దృశ్యం చూసి విస్తుబోయారట. కొండ మీద ఎత్తులో ఉండే రామోజీ ఇంటి నుంచి గేటు వరకు ఫిలిం సిటీ ఉద్యోగులు నిలబడి ఆయనపై పూలు చల్లుతూ సాగనంపారట. ఆ ఆతిథ్యం చూసి దాసరి కదిలిపోయారని.. ఆ తర్వాత రామోజీతో చాలా స్నేహంగా మెలిగారని అంటారు. ఆ తర్వాత రామోజీ మీడియాలో దాసరికి మంచి ప్రాధాన్యం దక్కింది. ఇటీవల ఆయన చనిపోయిన సమయంలోనూ ఈనాడు, ఈటీవీల్లో మంచి కవరేజీ దక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు