శ్రీదేవికి చుక్కలు చూపిస్తున్న బాహుబలి

శ్రీదేవికి చుక్కలు చూపిస్తున్న బాహుబలి

అతిలోక సుందరి శ్రీదేవికి ‘బాహుబలి’ పెద్ద తలపోటుగా మారిపోయింది. తన కొత్త సినిమా ‘మామ్’ను ప్రచారం చేసుకుందామని ఎక్కడికి వెళ్లినా ఆమెకు ‘బాహుబలి’ పోటు తప్పట్లేదు. ‘మామ్’ ముచ్చట్లు మీడియాతో పంచుకుందామని ఆమె చూస్తుంటే.. ప్రతి ఒక్కరూ ‘బాహుబలి’ గురించి అడిగేవాళ్లే. ఆమెకేమో ఆ సినిమా గురించి స్పందించడం అసలేమాత్రం ఇష్టం లేదు.

శివగామి లాంటి పాత్రను ఎందుకొదిలేశారు అంటూ మీడియా వాళ్లు అదే పనిగా వాయించేస్తున్నారు. వరుసగా అదే ప్రశ్న ఎదురవుతుండే సరికి శ్రీదేవికి అసహనం వచ్చేసింది. ‘నో కామెంట్’ అన్నా కూడా మీడియా వాళ్లు వదలట్లేదు. దీంతో ‘‘సమయం వచ్చినపుడు బాహుబలి గురించి స్పందిస్తా’’ అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేసిందామె.

తన 300వ సినిమా అయిన ‘మామ్’ను శ్రీదేవి చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కొంత కాలంగా ఈ సినిమాను పనిగట్టుకుని ప్రమోట్ చేస్తోంది. కానీ దానికి అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. ఈ చిత్రాన్ని ప్రాంతీయ భాషల్లో కూడా రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ.. జనాల్లో అసలేమాత్రం ఆసక్తి కనిపించట్లేదు. శ్రీదేవి స్వయంగా డబ్బింగ్ చెబుతోందన్నా పట్టించుకునే నాథుడే లేడు.

దీంతో ఈ నెల 7న హిందీ వెర్షన్‌తో పాటు మిగతా వెర్షన్లు కూడా రిలీజవుతాయా అన్నది సందేహంగానే మారింది. రాజమౌళి లాంటి వాడు శివగామి లాంటి పాత్ర కోసం అడిగితే నో చెప్పిందంటూ శ్రీదేవి మీద జనాలకు ముందు నుంచే ఒక వ్యతిరేక భావం ఉండగా.. శ్రీదేవి ఆ సినిమా కోసం ఎంత పారితోషకం అడిగింది, ఎన్ని గొంతెమ్మ కోర్కెలు కోరింది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వివరించడంతో ఆమెపై జనాల వ్యతిరేకత మరింత పెరిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు