అతడి దగ్గర నలభై కథలున్నాయట

అతడి దగ్గర నలభై కథలున్నాయట

అడివి శేష్ అనగానే అందరికీ నటుడిగానే గుర్తుకొస్తాడు. కానీ అతను నటుడు కాకముందే దర్శకుడు. అతడి దర్శకత్వంలో రెండు తెలుగు సినిమాలు రూపొందాయన్న సంగతి చాలామందికి
తెలియదు. ఆ రెండు సినిమాలు వచ్చిన సంగతి.. వెళ్లిన సంగతి కూడా జనాలకు గుర్తు లేదు.

‘కర్మ’ అనే సినిమాతో శేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో అతనే కథానాయకుడిగా నటించాడు. ఆపై ‘కిస్’ అనే ఇంకో సినిమా కూడా తీశాడు. రెండూ అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. నటుడిగా ‘పంజా’ అతడికి లైఫ్ ఇచ్చింది. తర్వాత మరిన్ని అవకాశాలందుకున్నాడు. ఐతే నటనలో బిజీ అయినంత మాత్రాన తాను రైటింగ్ పక్కన పెట్టేయలేదని అంటున్నాడు శేష్.

అడివి శేష్ దగ్గర ప్రస్తుతం 40 కథల దాకా ఉన్నాయట. వాటిలో ‘ది బెస్ట్’ అనుకున్నవి తీసి సినిమాలు చేస్తానని అంటున్నాడు శేష్. గత ఏడాది సూపర్ హిట్టయిన ‘క్షణం’కు స్క్రిప్టు అందించింది శేషే అన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడతను కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గూఢచారి’కి కూడా అతనే కథ అందించాడట. మున్ముందు తన కథలతో మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయని.. దర్శకుడిగానూ సక్సెస్ సాధించాలన్న ఆశ ఉందని చెప్పాడు శేష్. నటుడిగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ‘బాహుబలి’లో చిన్న పాత్రతో వచ్చిన గుర్తింపు అలాంటిలాంటిది కాదన్నాడు శేష్. ఆ పాత్ర వల్ల తాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారని చెప్పాడు. ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమీతుమీ’లో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులతో కలిసి చేయడం సవాలుగా మారిందని శేష్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు