దాసరి తాగరు.. మమ్మల్ని తాగనివ్వరు

దాసరి తాగరు.. మమ్మల్ని తాగనివ్వరు

సినీ పరిశ్రమలోకి వస్తే మద్యం ముట్టక తప్పదని అంటారు చాలామంది. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నడూ మద్యం ముట్టలేదన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంకా దర్శకుడు కాకముందు రచయితగా కొనసాగుతున్న సమయంలో ఒక పార్టీ సందర్భంగా అప్పటి ప్రముఖ వీటూరి.. మద్యం  గ్లాసు చేతికిచ్చి.. ఇక్కడ మద్యం తాగకపోతే దర్శకుడు కావడం కష్టం అని అన్నా తిరస్కరించిన వ్యక్తి దాసరి. మందు ముట్టక తప్పని పరిస్థితి వస్తే సినిమా పరిశ్రమనే వదిలేసి వెళ్లిపోతా అని కూడా ఆయన ఛాలెంజ్ చేశారట. దాని ప్రకారమే ఆయన ఎప్పుటూ టీటోటలర్‌గానే కొనసాగారు. దాసరి ఈ విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉండేవారో.. ఆయన ప్రియ శిష్యుడు మోహన్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించాడు.

‘‘గురువు గారు మద్యం ముట్టరు. నేను విస్కీ తాగుతాను. ఐతే ఆయన మీద అభిమానంతో జనాలు మంచి మంచి బ్రాండ్స్ గిఫ్ట్‌గా ఇచ్చేవాళ్లు. వాటిని చూసి.. మేం బాధపడేవాళ్లం. ‘ఆయన తాగడు. మనల్ని తాగనివ్వడు’ అని జోకులేసుకునేవాళ్లం. నాతో పాటు గురువుగారి శిష్యులెవ్వరూ కూడా ఆయన ముందు తాగేవాళ్లం కాదు. ఐతే ఒకసారి నేను ఆయనతో.. ‘గురువుగారూ.. మీరు రాగానే గ్లాస్లు పక్కన పెట్టడం, భయపడటం.. ఇబ్బందిగా ఉంది. అసలెందుకు నేను మీకెందుకు భయపడాలండీ? నేను ఇకనుంచి మీ ముందే తాగుతా’ అంటే.. గట్టిగా నవ్వారు’’ అని మోహన్ బాబు చెప్పారు. తనకు.. తన గురువుకు అప్పుడప్పుడు గొడవలు వచ్చేవని.. తండ్రీ కొడుకుల మాదిరే ఒకరి మీద ఒకరం అలిగేవారమని.. కానీ తర్వాత కలిసిపోయేవాళ్లమని మోహన్ బాబు తెలిపాడు. తన తండ్రి తర్వాత దాసరి వెళ్లిపోయినప్పుడే తాను అంతగా విలవిలలాడిపోయానని మోహన్ బాబు చెప్పారు.

 ఎన్నోసార్లు ఆయన అలిగారు... నేనూ అలిగాను. ఏ ఇంట్లో తండ్రీకొడులు, అన్నదమ్ములు అలగరు. మా అలక కూడా అలాంటిదే. నేను బాగా బిజీ అయ్యాక అప్పటికప్పుడు డేట్స్‌ అడిగితే, అడ్జస్ట్‌ చేయలేకపోయినప్పుడు అలిగేవారు. అలాగే ఆయనలా ఇండస్ట్రీ సమస్యలను నెత్తినేసుకున్నప్పుడు. ‘మీకెందుకు’ అనేవాణ్ణి. నా మాటకు ఒక్కొక్కసారి విలువిచ్చేవారు. విశ్వాస ఘాతకులు అనేవాళ్ల సమస్యలను కూడా నెత్తిన వేసుకున్నప్పుడు అలిగేవాణ్ణి. ఆ తర్వాత ఆయనే, నా అసిస్టెంట్‌కి ఫోన్‌ చేసి, నాకివ్వమని ‘మోహనా.. ఇంటికి రా’ అనేవారు. ‘గురువుగారూ నమస్కారం’ అంటూ వెళ్లేవాణ్ణి. ‘ఆ.. ఇప్పుడేమైంది? నేనేం అన్నానని’ అనేవారు. ఇద్దరం మళ్లీ మాట్లాడుకునేవాళ్లం.

నేను ఎన్నో కుటుంబాల్లో దీపాలు వెలిగించినవాణ్ణి అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ,ఎంతోమందికి చేశారాయన. కాకపోతే ‘నా బిడ్డలకు భగవంతుడు ఎందుకు సహాయం చేయలేదు’ అనే ఫీలింగ్‌ ఉండేది. అది చెప్పి, బాధపడేవారు. అరుణ్‌ కుమార్‌ (దాసరిగారి రెండో కొడుకు) చూడ్డానికి చాలా బాగుంటాడు. అతనితో కూడా ఆయన సినిమాలు తీశారు. కానీ, ఆశించినట్లుగా కెరీర్‌ ఎదగలేదు. ఆ విషయంలో ఆయనకు దిగులు ఉండేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు