షాకింగ్‌: ద‌ర్మ‌క ర‌త్న దాస‌రి ఇక లేరు

షాకింగ్‌: ద‌ర్మ‌క ర‌త్న దాస‌రి ఇక లేరు

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ పెద్ద దిక్కును కోల్పోయింది. స‌మ‌స్య ఏదైనా స‌రే.. ప‌రిష్కారం కోసం ఎదురుచూసే పెద్ద ఇక లేన‌ట్లే. వివాద‌మైనా.. సినిమాకు సంబంధించింది మ‌రేదైనా కొండంత అండ అనుకునే ద‌ర్శ‌క‌ర‌త్న  దాస‌రి (75) ఉన్నార‌న్న ధైర్యం ఇక‌పై లేన‌ట్లే. తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న కిమ్స్ లో ఈ రోజు  (మంగ‌ళ‌వారం) సాయంత్రం ఏడు గంట‌ల స‌మ‌యంలో శాశ్విత నిద్ర‌లోకి జారి పోయిన‌ట్లుగా వైద్యులు ప్ర‌క‌టించారు.

దాస‌రి ఇక లేర‌న్న కిమ్స్ వైద్యులు ప్ర‌క‌ట‌న‌కు కొద్దిసేప‌టి ముందు ఆసుప‌త్రి వెలుప‌ల‌కు వ‌చ్చిన ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతూ.. గురువుగారు ఇక లేరు.. కాసేప‌ట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నామ‌ని వెల్ల‌డించారు. కొద్ది నెల‌ల క్రిత‌మే అనారోగ్యంతో కిమ్స్ లో చేరిన దాస‌రి తీవ్ర అనారోగ్య ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయ‌న అన్న వాహిక‌కు రీక‌న్ స్ట్ర‌క్రివ్ స‌ర్జ‌రీ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న కిడ్నీల‌కు స‌మ‌స్య  ఏర్ప‌డింది. తాజాగా అన్న‌వాహిక‌కు ఇన్ ఫెక్ష‌న్ కావ‌టంతో ఆసుప‌త్రిలో చేర్చారు. ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌టంతో అత్య‌వ‌స‌ర చికిత్స‌ను వైద్యులు అందించే ప్ర‌య‌త్నం చేశారు. రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న గుండె ప‌ని చేయ‌టం మానేసింద‌ని.. దాన్ని తిరిగి పున‌రుద్ధ‌రించేందుకు ఎంత ప్ర‌య‌త్నం చేసినా సాధ్యం కాలేద‌ని కిమ్స్ వైద్యులు వెల్ల‌డించారు.

దాస‌రికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని వారి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేసిన త‌ర్వాత మాత్ర‌మే.. మీడియాకు వెల్ల‌డిస్తామ‌ని.. బుధ‌వారం నివేదిక వెల్ల‌డించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నాలుగు రోజుల క్రితం దాస‌రి ఆరోగ్యం విష‌మించ‌టంతో ఆయ‌న్ను కిమ్స్ లో చేర్చిన‌ట్లు వెల్ల‌డించారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో 1942 మే నాలుగున మ‌హాల‌క్ష్మి.. సాయిరాజ్ దంప‌తుల‌కు దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మించారు. తాతా మ‌న‌మ‌డు చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌న సినీ ప్ర‌స్థానాన్ని షురూ చేశారు. న‌టుడిగా.. ద‌ర్శ‌కుడిగా.. నిర్మాత‌గా త‌న ప్ర‌తిభ‌తో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై త‌న ముద్ర వేసిన ఆయ‌న‌.. ఎన్టీఆర్ తో స‌హా ప‌లువురు న‌టుల‌కు సినీ జీవితాన్ని ప్ర‌సాదించారు.

150 చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆయ‌న్ను ఎన్నో అవార్డులు వ‌రించాయి. ఆయ‌న‌కు ఒక కుమార్తె.. ఇద్ద‌రు కుమారులున్నారు  దాస‌రి ద‌ర్వ‌క‌త్వంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో కొన్ని.. శివ‌రంజ‌ని.. ప్రేమాభిషేకం.. మేఘ సందేశం.. గోరింటాకు.. స‌ర్దార్ పాపారాయుడు.. బొబ్బిలిపులి.. ఒసేయ్ రాముల‌మ్మ త‌దిత‌ర సినిమాలు ఉన్నాయి. దాస‌రిని వ‌రించిన అవార్డులు చూస్తే.. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం తాత-మ‌న‌మ‌డుకు నంది అవార్డు (1974).. స్వ‌ర్గం-న‌ర‌కం చిత్రానికి నంది పుర‌స్కారం.. మేఘ సందేశం చిత్రానికి ద‌ర్శ‌కుడిగా నంది అవార్డు (1982).. మామ‌గారు చిత్రానికి ఉత్త‌మ న‌టుడిగా నంది అవార్డు (1982).. ఆంధ్రా వ‌ర్సిటీ నుంచి క‌ళాప్ర‌పూర్ణ గౌర‌వ పుర‌స్కారం.. 2007లో ఎన్టీఆర్ జాతీయ పుర‌స్కారం.. 2009లో శోభ‌న్ బాబు తొలిస్మార‌క పుర‌స్కారం వ‌రించాయి.  రాజ‌కీయంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న ఆయ‌న‌.. కేంద్రంలో స‌హా మంత్రి బాధ్య‌త‌ల్ని పోషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు