మహేష్-మురుగ.. డిష్యుం డిష్యుం?

మహేష్-మురుగ.. డిష్యుం డిష్యుం?

ప్రతి ఏటా తన తండ్రి పుట్టిన రోజు నాడు తన కొత్త సినిమాలకు సంబంధించి ఏదో ఒక విశేషాన్ని బయటపెట్టడం.. అభిమానుల్ని అలరించడం మహేష్ బాబుకు అలవాటు. అన్నీ కలిసొస్తే.. ఈసారి కృష్ణ పుట్టిన రోజుకు ‘స్పైడర్’ సినిమానే విడుదల చేయాలని భావించాడు మహేష్. కానీ అతననుకున్నట్లుగా ‘స్పైడర్’ ముందుకు కదల్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడి సెప్టెంబరుకు వెళ్లిపోయింది.

ఐతే కనీసం ఈ మే 31న ‘స్పైడర్’ టీజర్ అయినా రిలీజ్ చేయించాలని అనుకున్నాడు మహేష్. నెల కిందటే ఈ విషయంలో మురుగదాస్‌తో అండర్ స్టాండింగ్ కూడా జరిగింది. పది రోజుల కిందటే ‘స్పైడర్’ యూనిట్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి కూడా.

కానీ రెండు మూడు రోజుల కిందట కథ అడ్డం తిరిగినట్లు వార్తలు మొదలయ్యాయి. టీజర్ విషయంలో మురుగదాస్ రాజీ పడదలుచుకోలేదని.. దాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్ది వచ్చే నెలలో టీజర్ రిలీజ్ చేయాలని అనుకున్నట్లు తెలిసింది. కృష్ణ పుట్టిన రోజుకు టీజర్ లేదంటూ మీడియాకు కూడా ఉప్పందింది. దీనిపై వార్తలు బయటికి రాగానే సోషల్ మీడియాలో మహేష్ అభిమానుల గోల మామూలుగా లేదు.

ఇప్పటికే మురుగదాస్ అనేక రకాలుగా నిరాశకు గురి చేశాడని.. ఇప్పుడు మళ్లీ ఇలా చేశాడేంటని అంటూ అతణ్ని తిట్టిపోయడం మొదలుపెట్టారు. ఇంతకుముందే ఓసారి అభిమానుల ఆందోళన గమనించి ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ గురించి క్లారిటీ ఇచ్చిన మహేష్‌కు మరోసారి.. అభిమానుల ఆగ్రహమేంటో తెలిసింది. తన తండ్రి పుట్టిన రోజుకు టీజర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల్సిందే అని పట్టుబట్టి.. మురుగదాస్‌తో కొట్లాడి మరీ టీజర్ 31కే వచ్చేలా ప్రణాళిక మార్చాడట మహేష్. ఈసారి మహేష్.. మురుగ విషయంలో కొంచెం గట్టిగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అభిమానుల్ని మరీ అంత ఫ్రస్టేట్ చేయడం మంచిది కాదని భావించి టీజర్ 31కే వచ్చేలా మహేష్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు