అల్లుతో గొడవపై రాజమౌళి క్లారిటీ

అల్లుతో గొడవపై రాజమౌళి క్లారిటీ

‘మగధీర’ విషయంలో రాజమౌళికి.. మెగా ఫ్యామిలీకి చెడిందన్నది ఎప్పట్నుంచో ఉన్న రూమర్. ఈ సినిమా క్రెడిట్లో ఎక్కువ భాగం చరణ్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని.. అది రాజమౌళికి నచ్చలేదని.. ఆ కోపంతోనే ఈగను హీరోగా పెట్టి సినిమా చేశాడని ఇండస్ట్రీలో ఒక ప్రచారం ఉంది.

దీని గురించి రాజమౌళి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఐతే తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో పాల్గొన్న రాజమౌళి ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. అల్లు అరవింద్‌తో తనకు తేడాలొచ్చిన మాట వాస్తవమే అని.. ఐతే అందుకు కారణం అందరూ అనుకుంటున్నది మాత్రం కాదని స్పష్టం చేశాడు రాజమౌళి.

తనకు క్రెడిట్ ఇచ్చే విషయంలో మగధీర టీం అన్యాయమేమీ చేయలేదని స్పష్టం చేశాడు రాజమౌళి. ‘మగధీర’ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో పోస్టర్ మీద తాను.. చరణ్ గుర్రం మీద వెళ్తున్న ఫొటో వేసి తీసుకొచ్చి అరవింద్ చూపించారని.. అది అవసరమా అన్నా కూడా వినకుండా అరవింద్ దాన్ని రిలీజ్ చేశారని.. క్రెడిట్ విషయంలో తమ మధ్య విభేదాలేమీ లేవని తేల్చి చెప్పాడు జక్కన్న.

ఐతే అరవింద్‌ మీద తనకు వేరే కోపాలు చాలా ఉన్నాయని రాజమౌళి తెలిపాడు. దానికి సంబంధించి ఓ ముఖ్య విషయం రాజమౌళి పంచుకున్నాడు. అప్పట్లో వంద రోజుల సెంటర్లను కొంచెం ఎక్కువ చేసి చూపించే ఆనవాయితీ ఉండేదని.. ‘మగధీర’ విషయంలో అలా చేయొద్దని అల్లు అరవింద్‌కు చెప్పగా.. ఆయన సరే అన్నారని.. కానీ సినిమా వంద రోజులు పూర్తి చేసుకునే సమయానికి మాత్రం వంద రోజుల సెంటర్లంటూ పోస్టర్ రిలీజ్ చేశారని రాజమౌళి తెలిపాడు.

ఇది తనకు నచ్చలేదని.. అదే విషయమై అరవింద్‌ను అడగ్గా.. అభిమానుల కోసం ఇలాంటివి తప్పదని అన్నారని.. ఐతే మాటంటే మాటే అంటూ తాను నొచ్చుకున్నానని చెప్పాడు. అందుకే ‘మగధీర’ 100 రోజుల వేడుకకు తాను రాలేనని చెప్పానని.. అన్నట్లే వెళ్లలేదని రాజమౌళి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు