శ్రీదేవి మీద రాజమౌళికి అంత ఇదా..

శ్రీదేవి మీద రాజమౌళికి అంత ఇదా..

‘బాహుబలి’లో శివగామి పాత్రకు ముందుగా అనుకున్నది శ్రీదేవిని అన్న సంగతి తెలిసిందే. స్వయంగా రాజమౌళే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆమె కాదన్నాకే రమ్యకృష్ణను అడగడం.. ఆమె కథ విని మరో ఆలోచన లేకుండా ఒప్పుకోవడం జరిగాయి. ఐతే రాజమౌళి లాంటి దర్శకుడు.. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీ కోసం అడిగితే శ్రీదేవి ఒప్పుకోకపోవడం ఏంటి అన్న చర్చ నడిచింది జనాల్లో. ఈ అంశం శ్రీదేవిపై వ్యతిరేకత పెరిగేలా చేసింది. ఐతే శివగామి పాత్రను శ్రీదేవి చేయకపోవడం మంచికే అయిందని.. ‘బాహుబలి’ మెగా బ్లాక్ బస్టర్ కావడం ద్వారా శ్రీదేవికి పంచ్ గట్టిగానే తగిలిందని కామెంట్లు చేశారు జనాలు.

ఐతే శ్రీదేవి శివగామి పాత్రకు నో చెప్పడాన్ని రాజమౌళి లైట్ తీసుకుని ఉంటాడేమో అనే అనుకున్నారంతా. కానీ ఆమె కాదన్నందుకు రాజమౌళి హర్టయినట్లే ఉన్నాడు. తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం’లో పాల్గొన్న రాజమౌళి శ్రీదేవి గురించి కొంచెం అసహనంగానే మాట్లాడాడు. ఈ ప్రోగ్రాం ప్రోమోలో.. శ్రీదేవిపై రాజమౌళి వ్యాఖ్యల్ని చూపించారు. శ్రీదేవి అయితే మార్కెట్ ఎక్కువుంటుందని.. అన్ని భాషల వాళ్లకూ ఆమె కనెక్టవుతారని భావించే ఆమెను సంప్రదించినట్లు రాజమౌళి తెలిపాడు.

ఆమె నో చెప్పడంపై స్పందిస్తూ.. అదృష్టం కొద్దీ.. మా అదృష్టం కొద్దీ.. ఆమె సినిమా ఒప్పుకోలేదు అంటూ ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పడం.. ఆ సమయంలో హావభావాలు చూస్తే శ్రీదేవి మీద రాజమౌళికి బాగానే కోపం ఉందని.. ఆమె నో చెప్పడంతో రాజమౌళి ఇగో బాగానే హర్టయిందని అర్థమవుతోంది. ఇక ఈ ప్రోగ్రాంలో ‘మగధీర’ సందర్భంగా అల్లు అరవింద్‌తో విభేదాలు మొదలు.. దర్శకుడిగా తనకున్న మార్కెట్ గురించి.. బాహుబలి విషయంలో తనకు మొదట్లో ఉన్న భయాల గురించి కూడా రాజమౌళి ఓపెన్ అయ్యాడు. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసారం కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు