తమ్ముడు ఆటంబాంబు

తమ్ముడు ఆటంబాంబు

నందమూరి కళ్యాణ్ రామ్.. తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తారక్‌ను అతడు ‘ఆటంబాంబు’గా అభివర్ణించాడు. తానా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ పేరిట నెలకొల్పిన అవార్డును అందుకోవడానికి కళ్యాణ్ రామ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడ ఏర్పాటు చేసిన ఓ గెట్ టు గెదర్ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతుండగా.. అభిమానుల నుంచి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. తమ్ముడి గురించి చెప్పండి అని అడగ్గానే.. ‘‘ఒక్క మాటలో చెప్పమంటారా..? ఆటంబాంబు’’ అని అన్నాడు కళ్యాణ్ రామ్. అంతలో ఎవరో ‘లెజెండ్’ అని అరిస్తే.. ‘‘ఆ మాట తమ్ముడికి వాడొద్దు. తను ఎప్పటికీ లెజెండ్ కాదు. అది తాత గారికి మాత్రమే ఉపయోగించాలి’’ అన్నాడు కళ్యాణ్ రామ్.


ఇక బాలయ్యతో సినిమా ఎప్పుడు అని ఓ అభిమాని అడిగితే.. తప్పకుండా చేస్తానని.. ఐతే మంచి కథ దొరకాలని.. ఏ సినిమా అయినా తన మనసుకు నచ్చితేనే చేస్తానని కళ్యాణ్ రామ్ బదులిచ్చాడు. చిన్న తమ్ముడు మోక్షజ్న అరంగేట్రం ఎప్పుడు అని ఓ అభిమాని అడగ్గా.. ‘‘అది బాబాయి చెబితేనే బాగుంటుంది. ఆయనకు పుత్రోత్సాహం అనేది ఉంటుంది కదా. బాబాయే చెబుతారు’’ అని కళ్యాణ్ రామ్ అన్నాడు.

అమెరికా తనకు చాలా ఇష్టమైన దేశం అని.. తాను ఇక్కడే చికాగోలో చదువుకున్నానని.. ఉద్యోగం కూడా చేశానని.. తనకు మొదట్లో సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశమే లేదని.. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతికేయాలని అనుకున్నానని.. తర్వాత సినిమాల్లోకి వెళ్లి రెండు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాక.. అనవసరంగా అమెరికా వదిలి వచ్చేశామే అన్న ఫీలింగ్ కూడా కలిగిందని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు