ఇండియాలో ప్రపంచకప్ ఉండదా?

మొత్తానికి కరోనా ధాటికి ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోయింది. మళ్లీ మ్యాచ్‌లు ఎప్పుడుంటాయో తెలియట్లేదు. ఐపీఎల్ వాయిదా పడటమే భారత క్రికెట్ అభిమానులకు రుచించని విషయం అంటే.. దాన్ని మించిన చేదు వార్త ఒకటి వినిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడి నుంచి తరలించబోతున్నారన్నదే ఆ వార్త.

గత ఏడాది ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా దాన్ని రద్దు చేసి 2022కు వాయిదా వేశారు. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన తర్వాతి ప్రపంచకప్‌ను యధావిధిగా నిర్వహించాలనుకున్నారు. చివరగా 2016లో పొట్టి కప్పు భారత్ వేదికగానే జరిగింది. ఆ తర్వాత 2018లో జరగాల్సిన టోర్నీ అనివార్య కారణాలతో రద్దయింది. 2020 టోర్నీని వాయిదా వేశారు. 2021 టోర్నీని యధావిధిగా భారత్‌లో నిర్వహించాలనుకున్నారు. ఇలా ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇండియాలోనే టీ20 ప్రపంచకప్ జరగబోతోందని మన అభిమానులు సంతోషించారు.

కానీ ఇప్పుడు చూస్తే భారత్‌లో టోర్నీ జరగడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. టోర్నీకి ఇంకో నాలుగు నెలలే టై ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా ఎలా విలయ తాండవం చేస్తోందో తెలిసిందే. ఇంకొన్ని నెలల పాటు కరోనా ప్రభావం పెద్దగా తగ్గేట్లు లేదు. ఐపీఎల్ సజావుగా సాగి ఉంటే ప్రపంచకప్‌ను ఇండియాలో నిర్వహించడంపై ఆశలుండేవి. కానీ ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ.. టోర్నీని మధ్యలో ఆపేయక తప్పట్లేదు.

ఇండియాలో కరోనా మూడో వేవ్ కూడా ఉంటుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడ నిర్వహించే సాహసం ఐసీసీ చేయకపోవచ్చు. ఇక్కడ ఈ టోర్నీ ఆడటానికి విదేశీ జట్లు కూడా అంగీకరించడం అనుమానమే. కాబట్టి గత ఏడాది ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించిన యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ను జరిపిద్దామని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీన్ని భారత్ కూడా వ్యతిరేకించకపోవచ్చనే భావిస్తున్నారు.