మంత్రి గారి కొడుకు సినిమాను పట్టించుకుంటారా?

మంత్రి గారి కొడుకు సినిమాను పట్టించుకుంటారా?

గత కొన్నేళ్లలో తెలుగు తెరపై వారసుల హవా బాగా పెరిగింది. హీరోల కొడుకులే కాదు.. మిగతా విభాగాలకు చెందిన వాళ్లు కూడా తమ కొడుకుల్ని హీరోలుగా చేస్తున్నారు. మరోవైపు రాజకీయ రంగానికి చెందిన వాళ్లు సైతం సినిమాలపై ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ కూడా సినీ రంగంపై ఆసక్తితో.. నటనలో శిక్షణ తీసుకోవడం.. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్టయిన ‘సేతుపతి’ సినిమాను రవితేజ హీరోగా రీమేక్ చేస్తున్నాడు జయంత్. ఆ సినిమా పేరు.. జయదేవ్.

కొన్నాళ్ల కిందటే ‘జయదేవ్’ ప్రమోషన్లు మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి ఒక్కో పాటా రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం. కానీ జనాలు ఈ సినిమాను పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా లేదు. సోషల్ మీడియాలో కానీ.. ఇతర మీడియాల్లో కానీ ‘జయదేవ్’ గురించి డిస్కషనే లేదు. రవితేజలో హీరో లుక్స్ ఏమీ కనిపించకపోగా.. అతడి సరసన నటిస్తున్న అమ్మాయి కూడా అంతంతమాత్రంగా ఉంది.

‘సేతుపతి’ సినిమా చూసిన వాళ్లకు రవితేజ ఈ సినిమాకు ఏమాత్రం సూటవుతాడో అన్న సందేహాలు కలుగుతున్నాయి. విజయ్ సేతుపతి చేసిన ఇంటెన్స్ పోలీస్ పాత్రను కొత్తవాడైన రవితేజ ఎలా పోషించాడో అని డౌట్ కొడుతోంది. ఇమేజ్ ఉన్న హీరో అయితే ఈ పాత్రకు బాగుండేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త హీరో ఇలాంటి సినిమాతో అరంగేట్రం చేయడం రాంగ్ ఛాయిస్ అనిపిస్తోంది. ఐతే సీనియర్ దర్శకుడు జయంత్.. రవితేజ కోసం ఏరికోరి ఈ సబ్జెక్టు ఎందుకు ఎంచుకున్నాడో మరి. మొత్తానికి మంత్రి గారి కొడుకు తెరంగేట్రం ఎలా జరుగుతుందో చూద్దాం. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు